సిద్ధవటం మండలం ఉప్పరపల్లె గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని స్థానిక సచివాలయంలో జరిగిన కార్యక్రమానికి జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితమే నేటి స్వేచ్ఛా భారతదేశమన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా బయటకు వచ్చి తమ హక్కులను వినియోగించుకునే పరిస్థితులు ఏర్పడినప్పుడే స్వాతంత్ర్యానికి నిజమైన అర్థం చేకూరుతుందని పేర్కొన్నారు.
దేశ సమగ్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. అనంతరం సచివాలయ సిబ్బందికి, గ్రామ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొని జాతీయ పతాకానికి వందనం చేశారు.


