వీరులపాడు:
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు ప్రతి ఒక్కరికీ సక్రమంగా చేరేలా సమాజం లోని ప్రతి ఒక్కరూబాధ్యతగా వ్యవహరించాలని బీజేపీ జిల్లా మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ దేవరకొండ రమాదేవి అన్నారు. అంగన్వాడీ ఉత్సవం, సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా జుజ్జూరు మండలం లోని పలు అంగన్వాడీ కేంద్రా లను ఆమె సందర్శించారు. జుజ్జూరు అంగన్వాడీ కేంద్రం-4, పెద్దాపురం అంగన్వాడీ కేంద్రం-1, పెద్దాపురం అంగన్వాడీ కేంద్రం-3లను పరిశీలించి అక్కడ అందుతున్న సేవలు, మౌలిక వసతులను స్వయంగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలతో రమాదేవి నేరుగా మాట్లాడి వారికి అందుతున్న పౌష్టికాహారం, బాలసంజీవని కిట్లు సక్రమం గా అందుతున్నాయా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల కు అందిస్తున్నఅమృతాహారం నాణ్యత, పిల్లల ఆరోగ్య పరిస్థితులపై కూడా ఆరా తీశారు. “ఆరోగ్యవంతమైన తల్లి.. ఆరోగ్యవంతమైన బిడ్డ.. బలమైన సమాజానికి పునాది” అని పేర్కొంటూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ, మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని గర్భిణీలు, బాలింతలు, తల్లులకు సూచించారు. పిల్లల ఎదుగుదలలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుందని, చిన్నారుల ఆరోగ్యంపై తల్లులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
మెరుగైన సేవలకుఅభినందన
పెద్దాపురం అంగన్వాడీ కేంద్రం-1లో మెరుగైన సేవలు అందిస్తున్నట్లు గుర్తించిన రమాదేవి, అక్కడపనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ సరితను శాలువాతో సత్కరించి అభినందించారు. అంగన్వాడీ సిబ్బంది సేవలనుప్రశంసిస్తూ, చిన్నారులు మరియు మహిళల సంక్షేమం కోసం మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
నిరుపయోగంగా ఉన్న అంగన్వాడీ కేంద్రంపై దృష్టి
అనంతరం పెద్దాపురం అంగన్వాడీ కేంద్రం-3ను సందర్శించిన రమాదేవి, ఆ కేంద్రం నిరుపయోగంగా ఉండటంతో పాటు ఆక్రమణ లకు గురైన పరిస్థితిని గుర్తించారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన అంగన్వాడీ భవనం నిరుపయోగంగా ఉండటం పట్ల ఆమె సంబంధిత అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి, అంగన్వాడీ కేంద్రాన్ని త్వరలోనే పూర్తిస్థాయిలో వినియోగం లోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని అక్కడి అంగన్వాడీ టీచర్‌కు హామీ ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే అంగన్వాడీలకు మరింత బలం అంగన్వాడీ కేంద్రాలు కేవలం పిల్లలకు ఆహారం అందించే కేంద్రాలు మాత్రమే కాకుండా, చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యతో పాటు గర్భిణీలు, బాలింతల సంక్షేమానికి కీలక వేదికలని రమాదేవి పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఏవైనా సమస్యలు, లోపాలు కనిపిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేయాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్ వాడపల్లి విజయ్ బాబు, బీజేపీ సీనియర్ నాయకుడు కణితి సుబ్బారావు, అంగన్వాడీ సూపర్వైజర్ శారద, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు, పిల్లల తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.
