కుండపోతగా కురుస్తున్న వానలవల్ల బీహార్ రాజధాని పాట్నాలో అనేక ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలవల్ల పలు జిల్లాల్లో దాదాపు 20 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. పాట్నాలో ఆస్పత్రులు, మెడికల్ స్టోర్లు, ఆస్పత్రులు నడుం లోతు నీళ్లలో మునిగిపోయాయి.నగరంలో అన్ని వైద్య సదుపాయాలున్న అతిపెద్ద నలందా మెడికల్ కాలేజి ఆస్పత్రి కూడా వరద నీటిలో చిక్కుకుపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఓ యువతి చేసిన ఫోటోషూట్ నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిట్) స్టూడెంట్ అదితి సింగ్.. వరదల్లోనే ఫొటోషూట్ చేయించుకుంది. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మెర్మైడ్ ఇన్ డిజాస్టర్-పాట్నాలో వరద సమయంలో పరిస్థితి’ అనే టైటిల్ తో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆ యువతిని ఆడేసుకుంటున్నారు. ఈ ఫొటోషూట్ కాస్త క్రియేటివ్‌గా ఉందని… వర్షం, వరదలు వస్తే ఆమె తప్పేముంది? ఆమె నిట్ స్టూడెంట్ కాబట్టి తన క్రియేటివిటీని చూపించిందని కొందరు ఆ యువతికి సపోర్ట్ చేస్తున్నారు. మరికొంతమంది నెటిజన్లు ప్రజలు సమస్యల్ని చెప్పే విధానం ఇదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
SBI మెనేజర్ ఆత్మహత్య????? గుంటూరు జిల్లా తెనాలిలో ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ అంకిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల క్రితం తెనాలి బ్రాంచ్ కు డిప్యూటీ మేనేజర్ గా అంకిరెడ్డి వచ్చాడు. పై అధికారుల వేధింపులే తన భర్త ఆత్మహత్యకు కారణమని భార్య ఆరోపిస్తోంది. పోలీస్ విచారణలో మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది
షుగర్ జబ్బుకి పాదపూజకు సంబంధం ఏమిటి? భార్యకు భర్త పాదపూజ చేయడమేమిటి? నేను చదవడం తప్పా అని అనిపిస్తుంది కదూ! తప్పేమీ లేదు మీరు చదివింది వాస్తవమే. పూజ అంటే కాళ్లు కడిగి ఆ నీళ్లను తల మీద చల్లుకుని దండం పెట్టు కోవడం కాదు. వాళ్ల కేమైనా దెబ్బలు తగిలాయా అని చూసుకోవడమే దీని అర్థం. పది సంవత్సరాలు పైబడి షుగరు ఉన్నటువంటి వాళ్లలో చాలామందిలో అరికాళ్ళలో స్పర్శ తగ్గిపోతుంది. కాళ్ళకు తగిలిన చిన్న చిన్న దెబ్బలు తెలియవు. కాళ్లలో ముల్లు గుచ్చుకున్నా, రాళ్లు వత్తుకున్నా ,చెప్పులు కరిచినా తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఆ గాయాలే కాళ్ళు తీసి వేయాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు .అందుకే షుగర్ వుండి కాళ్లకు స్పర్శ తగ్గినటువంటి వాళ్ళు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కాళ్లకు ఇలాంటి దెబ్బలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించుకుని ,నిర్ధారించుకుని ఉండడం మంచిది. గాయాలు ఉంటే వెంటనే వైద్యం చేయించుకోవడం అవసరం. 60 ఏళ్లు పైబడిన వారిలో ఇటువంటి పరిస్థితి ఉంటే వాళ్లు వంగి వాళ్ళ కాళ్ళను చూసుకోవడం చాలామందిలో సాధ్యం కాదు అందుకే వారి జీవిత భాగస్వామి ఆ పని చేయడం మంచిది అలా రోజూ కాళ్లను రోగి బంధువులు కానీ జీవిత భాగస్వామి కానీ ఎవరో ఒకరు కాళ్ల పరిశీలన కార్యక్రమం చేయడం అవసరం. జీవిత భాగస్వామి తోనే ఇది సాధ్యం అవుతుంది. కాబట్టి తప్పక భార్యకు భర్త ,భర్తకు భార్య రోజూ కాళ్ళను పరిశుభ్రం గా ఉంచే ప్రయత్నం చేస్తే మోకాలు కిందకి కాళ్లను తీసి వేసే పరిస్థితిని చాలావరకు నివారించవచ్చు. డాక్టర్ యం.వి.రమణయ్య రాష్ట్ర అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక (ఆంధ్రప్రదేశ్) డా.రామచంద్రారెడ్డి ఆసుపత్రి, నెల్లూరు.
గుండెను పదిలంగా ఉంచుకుందాం గత 20 సంవత్సరాలుగా గుండె జబ్బుల నివారణ దినోత్సవాల పేరుతో ప్రపంచమంతా కార్యక్రమాలు జరుగుతున్నా గుండె పోటు బాధితుల సంఖ్య తగ్గకపోగా నిత్యం పెరుగుతూనే ఉంది. గతంలో 60 సంవత్సరాల వయసు పైబడిన వారిలో గుండెపోటు ఎక్కువగా కనిపించేది. ప్రస్తుతం 20 సంవత్సరాల వయసు వారికి కూడా గుండెపోటు వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 1.71 కోట్ల మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారు.వీరిలో 80 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందినవారే.మన దేశంలో చిన్నవయసులోనే ముఖ్యంగా 30, 40 సంవత్సరాల వయసులోనే ఎంతోమంది గుండెపోటు బారిన పడుతున్నారు. ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ రోజులలో ఎందుకిలా జరుగుతుందంటే నివారణ కొరకు మనం తీసుకునే జాగ్రత్తలు కంటే గుండెపోటుకు ప్రధాన కారణమైన మన జీవనశైలి ప్రభావం మనమీద అఎక్కువగా ఉండటం. ప్రతిరోజు లక్షసార్లు లబ్‌డబ్ అని స్పందిస్తూ.. రెండు వేల గ్యాలన్ల రక్తాన్ని శుద్ధిచేసి, అరవైవేల మైళ్ల దూరం వరకు ప్రవహించేలా పంపింగ్ చేసే పిడికెడు గుండె ఆధునిక మనిషి పరుగు వేగాన్ని అందుకోలేకపోతుంది. జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా గుండెపై ఒత్తిడి పెరిగింది. ప్రతిఏటా గుండె జబ్బుల మరణాల రేటు పెరుగుతుంది. జీవనశైలిలో వచ్చిన మార్పులను ఇలాగే కొనసాగిస్తే.. ప్రపంచంలోనే అత్యధిక హృదయరోగులున్న దేశంగా భారత్ మారుతోంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు .  ఇటీవల కాలంలో తలనొప్పి, జ్వరం ఎంత సాధారణంగా వస్తున్నాయో గుండెజబ్బులు కూడా అంతే సాధారణంగా మారిపోయాయి.ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి ఆదివారం అంటే ఈనెల 29వ తేదీన ప్రపంచమంతా జరుపుకోబోయే ప్రపంచ గుండె జబ్బుల నివారణ దినోత్సవం సందర్భంగా గుండెపోటుకు కారణాలు, నివారించుకోవడానికి మార్గాలు, ప్రాథమిక వైద్యం గురించి మరియు వైద్యం గురించి కొన్ని విషయాలు ……… గుండెపోటుకు కారణాలు గుండెపోటు కలిగించే కారణాలను రెండు రకాగాలుగా విభజించవచ్చు . మనం అదుపులో పెట్ట గలిగినవి ఒక రకం. మన అదుపులో పెట్ట లేనివి రెండవ రకం. అదుపులో పెట్టలేని కారణాలు : వంశచరిత్ర…..తల్లిదండ్రులకు కానీ తోబుట్టువులకు గాని గుండెపోటు వచ్చిన చరిత్ర ఉంటే ఆ కుటుంబంలోని సభ్యులకు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ కుటుంబంలో పుట్టిన వాళ్లు ఈ సమస్య నుంచి బయట పడలేరు. ప్రాంతీయం…….కొన్ని ప్రాంతాలలోని వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. గుండెపోటు ఎక్కువగా వచ్చే ప్రాంతాల జాబితాలో మన దేశం కూడా ఉంది. ఈ సమస్యని మనమేం చేయలేం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇప్పటికీ పుట్టేసాం. వయస్సు….. వయస్సు పెరిగే కొద్దీ గుండెపోటు వచ్చేఅవకాశం పెరుగుతుంది. వయసు పెరగడాన్ని మనమేం చేయలేం కదా. లింగత్వం…..గుండె పోటు వచ్చే అవకాశం మగవారిలో ఎక్కువ. నెలవారి వస్తున్నంత కాలం స్త్రీలకు గుండె పోటు నుంచి చాలా వరకు రక్షణ ఉంటుంది.నెలవారి ఆగిపోయిన తరువాత స్త్రీలలో కూడా గుండెపోటు వచ్చే అవకాశం దరిదాపుగా మగవారితో సమానంగా ఉంటుంది. మనం అదుపులో పెట్టగల కారణాలు : బరువు…..ఎత్తుకు తగిన బరువు ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ .ఊబకాయం వుంటే గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఎత్తుని సెంటీమీటర్లలో కొలుసుకొని అందులోంచి 100 తీసివేస్తే వచ్చేటటువంటి విలువ ఎంతో అన్ని కేజీలు మాత్రమే మన బరువు ఉండాలి. ఎత్తుకు సరిపడా ఉండవలసిన బరువు కంటే ఎక్కువ ఉన్నవారు ఖచ్చితంగా బరువు తగ్గించుకోవాలి. ఇందుకోసం తిండి తగ్గించుకుని పని పెంచుకోవాలి. బిపి……. బిపి ఎక్కువగా ఉన్నవారికి గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ . బీపీ జబ్బ రావడానికి చాలా సందర్భాల్లో కారణం తెలియకపోయినా బిపి జబ్బును అదుపులో పెట్టుకోవడం మన చేతిలోని పనే .సరైన వైద్యం చేసి బీపీని అదుపులో ఉంచుకుంటే గుండెపోటు వచ్చేఅవకాశం తగ్గుతుంది. బిపి నిశ్శబ్ద హంతకి. ఎటువంటి ఇబ్బంది పెట్టకనే మనిషి ప్రాణం తీయగలదు.బీపీ జబ్బు ఉన్నవారిలో సగం మందికి ఇది ఉన్నట్టుగా కూడా తెలియదు. బిపి జబ్బును గుర్తించిన వారిలో సగం మంది మాత్రమే వైద్యం చేయించుకుంటారు. వైద్యం మొదలు పెట్టిన వాళ్ళలో సగం మంది మాత్రమే వైద్యాన్ని కొనసాగిస్తారు. బిపి ప్రభావం మన మీద పడకుండా జాగ్రత్త తీసుకోవాలంటే మంచి ఒకసారి బిపి చూపించుకొని మధు మేహం…. షుగరు జబ్బు ఉన్న వాళ్లకి గుండెపోటు వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. షుగర్ను అదుపులో పెట్టుకో గలిగితే గుండెపోటు అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. షుగరు జబ్బు శరీరంలోని ఏ భాగాన్నైనా దెబ్బతీస్తుంది. షుగర్ జబ్బు ని కుక్క తో పోలుస్తారు. షుగర్ జబ్బు అదుపులో ఉంటే బొచ్చుకుక్క. అదుపు లేకపోతే పిచ్చికుక్క. బొచ్చు కుక్క మనం చెప్పినట్టు మన చుట్టూ తిరుగుతుంది .పిచ్చికుక్క దాని ఇష్టం వచ్చినట్లు కొరికి పారేస్తుంది ది. బొచ్చు కుక్క గా పెంచుకోవడమా లేదా పిచ్చికుక్కగా పెంచుకోవడమా అన్నది మన చేతుల్లో పని. అందుకే కే షుగర్ వ్యాధిగ్రస్తులు తగిన జాగ్రత్తలు తీసుకుని శివరంజని అదుపులో పెట్టుకుని గుండెపోటుని నివారించుకోవచ్చు. షుగరు జబ్బు వచ్చిన తర్వాత అదుపులో పెట్టుకోవడం ఒక భాగమైతే మన జీవనశైలిలో జాగ్రత్తలు తీసుకుని షుగర్ జబ్బు ని కొంతకాలం దూరంగా నెట్ అవ్వచ్చు. 40 సంవత్సరాలు వయసు కలిగిన వారందరూ సంవత్సరానికి ఒక పర్యాయం రక్త పరీక్ష చేయించుకోండి షుగరు ఉందో లేదో చూసుకుంటే షుగర్ జబ్బు మూడేళ్ల ముందుగానే గుర్తించవచ్చు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని షుగరు జబ్బు ముందుగానే గుర్తించడం, రాకుండా చూసుకోవడం ,వచ్చిన తర్వాత అదుపులో పెట్టుకోవడం ఇలాంటివి చేయగలిగితే షుగరు జబ్బు వల్ల గుండెపోటు వచ్చే అవకాశం లేకుండా చేసుకోవచ్చు. జీవనశైలి…… గుండెపోటుకు మనం జీవనశైలి ఒక ప్రధానమైన కారణం.ఉప్పు ఎక్కువగా తినడం.మానసిక వత్తిడికి ఎక్కువగా గురి కావడం. సరిపోయినంత నిద్ర లేకపోవడం. తక్కువ పనిచేయడం. అవసరానికి మించి తినడం లాంటిఅనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఉప్పు మన జీవితానికి పెద్ద ముప్పుగా మారింది. రోజుకు నాలుగు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదు. అంటే నెలకు 100 గ్రాములు ఉప్పు వరకు తినవచ్చు. కానీ మనం సుమారు అరకిలో ఉప్పు తింటున్నాం. ఉప్పును ఎంత వీలైతే అంత తగ్గించుకోవడం మంచిది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎనిమిది గంటలనిద్ర అవసరం. శాస్త్రసాంకేతిక రంగాలు అభివృద్ధి చెందే కొద్దీ మనిషికి నిద్ర కరువైపోతుంది .నిద్ర తగ్గితే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ధూమపానం….. పొగతాగేవారిలో గుండె పోటు వచ్చే అవకాశం మామూలు వాళ్ళ తో పోల్చుకుంటే మూడు రెట్లు ఎక్కువ పొగాకుకు సంబంధించిన ప్రతి అలవాటు గుండెకు ప్రమాదకరమే. గుండె పోటు బారిన పడకుండా ఉండాలంటే టూకీగా మనం పాటించవలసిన జాగ్రత్తలు * పొగ తాగ కూడదు. ఇప్పటికే అలవాటు ఉంటే వెంటనే మానెయ్యాలి. పొగాకును ఏ రూపంలో కూడా వాడకూడదు. *సమతులాహారం తీసుకోవాలి. ◆కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి ◆ రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి ◆ బరువు పెరగకుండా చూసుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. ◆ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ◆ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి*. ◆ తగినంత నిద్ర పోవాలి. ◆ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి ◆ ఉప్పు వినియోగాన్ని వీలైనంత తగ్గించుకోవాలి. గుండెపోటుకు ప్రాథమిక వైద్యం గుండె నొప్పి ప్రారంభమైన తరువాత మొదటి గంట చాలా విలువైనది. ఈ గంట సమయంలో వైద్యం చేయగలిగితే చాలా వరకు గుండెపోటు మరణాలను నివారించవచ్చు. ఈ గంట సేపు జరిగే వైద్యాన్ని గుండెపోటు ప్రాథమిక వైద్యం అంటారు. గుండె నొప్పి వచ్చిన వారికి ధైర్యం చెప్పాలి.నడిపించ కూడదు. వీలైతే కదలకుండా పడుకోబెట్టాలి. నడిపించినా,భయపడ్డా గుండె వేగం మరింత పెరిగి గుండెపోటు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది.వీలైనంత త్వరగా నాలుక కింద 325 మిల్లీగ్రాముల యాస్ప్రిన్ మాత్రను చప్పరించాలి.సార్బిట్రేట్ మాత్రను నాలుక కింద పెట్టుకోవాలి. ఈ మాత్రలు గుండెకు రక్తప్రసరణను పెంచే ప్రయత్నం చేస్తాయి. తద్వారా గుండెపోటు తీవ్రతను తగ్గిస్తాయి. ● ఆస్పిరిన్ మాత్రను అందుబాటులో వుంచుకోవడం ఎలా?● గుండె నొప్పి మొదలైన గంటలోపు ఆస్పిరిన్ మాత్ర మాత్రను చప్పరించాలి అన్న విషయం తెలుసుకోవడం ఒక భాగమైతే ,గుండె నొప్పి వచ్చిన ఆ గంటలో వాడడానికి అను కూలంగా ఆ మాత్రలను అందుబాటులో ఉంచుకోవడం మరో ముఖ్యమైన విషయం. గుండెపోటు వచ్చే అవకాశం ఉన్న వారందరూ ఈ మాత్రను ఎప్పుడూ వెంట ఉండే విదంగా చూసుకోవాలి. ఒక మాత్రను జేబులోని పర్స్ లో ఉంచుకోవచ్చు, ఒక మాత్రను తను ప్రయాణం చేసే వ్యక్తిగత వాహనంలో ఉంచుకోవచ్చు, ఒక మాత్రను తను పనిచేసే ఆఫీసులో ఉంచుకోవచ్చు ,ఒక మాత్రను తను పడుకొనే మంచం మీద పరుపుకింద ఉంచుకోవచ్చు .ఇలా వారి వారి అనుకూలాన్ని బట్టి ఎప్పుడు ఎక్కడ అవసరం వస్తే అక్కడ ఆ మాత్రను వెంటనే వినియోగించుకునే విధంగా అందు బాటులో ఉంచుకోవాలి. ఆస్పిరిన్ మాత్రతో పాటు క్లొపిడోగ్రిల్ 75 మిల్లీగ్రాముల మాత్రలు 4 మరియు ఒక్క అటార్వాస్టాటిన్ 80 మిల్లీగ్రాముల మాత్రను కూడా అందుబాటులో ఉంచుకో గల్గితే ఇంకా మంచిది. గుండెనొప్పి వచ్చిన వెంటనే ఈ మాత్రలన్నిటిని వేసుకో గలిగితే మరీ మంచిది . ఈ మాత్రలన్నీ కలిసి గుండెపోటు తీవ్రతను చాలా వరకు తగ్గించగలవు .ఈ విధంగా ఈ మూడు మాత్రలను సామూహికంగా వాడే విధానాన్ని గుండెపోటు లోడింగ్ డోస్ విధానం అంటారు. గుండెపోటు వచ్చిన వెంటనే ఈ మాత్రలను వేసుకుని వీలైనంత త్వరగా డాక్టర్ గారిని సంప్రదించాలి. గుండె నొప్పి తదుపరి వైద్యాన్ని డాక్టర్ గారు చూసుకుంటారు. ఈ సందర్భములో చాలామందికి ఒక అనుమానం రావచ్చు. మనకి వచ్చిన నొప్పి గుండెపోటు కాదేమో, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏమో, గుండె నొప్పని భావించి ఈ మాత్రలు వాడితే ప్రమాదమేమన్నా జరుగుతుందేమో అన్న అనుమానం కూడా రావచ్చు. గుండెపోటు కాకపోయినా ఈ మాత్రలు వాడితే ప్రాణానికి వచ్చిన ప్రమాదమేమీ
మనల్ని కరిచిన కుక్కను ఏమి చేయాలి? చేసేది ఏముంది, కొట్టి చంపి పారేయాలి అన్నది ఎక్కువమంది చెప్పే సమాధానం.ఇది తప్పు. ఆ కుక్కను కొట్టకూడదు. చంపకూడదు. బ్రతికించు కోవాలి. ఎందుకంటే మనల్ని కరిచిన కుక్క పది రోజులు బ్రతికుంటే మనకు దానివలన రేబీస్ వ్యాధి వచ్చే అవకాశం లేదు. అందుకే ఆ కుక్కను జాగ్రత్తగా చూసుకోవాలి .ఎంత జాగ్రత్తగా అంటే కొత్తగా ఇంటికి వచ్చిన అల్లుణ్ణి చూసుకున్నంత జాగ్రత్తగా. రేబిస్ వ్యాధి మనకు రావాలంటే మనల్ని కరిచిన కుక్కకు రేబిస్ వ్యాధి ఉండి దాని లాలాజలంలో వైరస్ ఉండాలి. అలా లాలాజలంలో వైరస్ ఉన్న కుక్క వారం లోపల చనిపోవలసిందే. రేబిస్ వ్యాధి వచ్చి వారానికి మించి బ్రతికిన జంతువు ఇంతవరకు లేదు. మనల్ని కరిచిన కుక్క వారానికి మించి బతికింది అంటే దానికి రేబీస్ లేదు .మరి దానికే లేనప్పుడు అది కరవడం ద్వారా మనకు రేబీస్ వచ్చే అవకాశం లేనే లేదు. ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికే మనల్ని కరిచిన కుక్కని పదిరోజులపాటు గమనించుకోవాలి. కుక్క కాటు గాయాన్ని ఏం చేయాలి? వీలైనంత త్వరగా గాయాన్ని నీళ్ళతో కడగాలి.వీలైతే సబ్బుతో కడగడం మంచిది. గాయాన్ని పైపైన కడగడం కాదు లోతుగా కడగాలి. అందుకే కుళాయి కింద గాయ మైన భాగాన్ని ఉంచి గాయం లోపలకు నీరు పోయే విధంగా కడగాలి. అప్పుడే గాయం లోపల ఉన్న రేబిస్ కారక వైరస్ పూర్తిగా తొలగి పోతుంది. కరచిన వెంటనే కుళాయి అందుబాటులో లేనప్పుడు మగ్గులో నీరు తీసుకుని ఎత్తులో నుంచి గాయం మీద పడేటట్టుగా కడగడం మంచిది. ఇలా కనీసం పది సార్లు కడగాలి.ఇలా వెంటనే గాయాన్ని కడగ గలిగితే మనల్ని కరిచిన కుక్కకు రేబిస్ ఉన్నా దానివలన మనకు వచ్చే అవకాశం దరిదాపుగా లేనట్టే. రేబిస్ వ్యాధి సోకి, బ్రతికిన జీవి ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ వ్యాధికి ఇంతవరకు వైద్యం కనుగొనబడలేదు. ఈ వ్యాధి సోకితే వారంరోజుల్లో చనిపోవలసిందే . ఇలాంటి భయంకరమైన వ్యాధి నివారణకు 1885 సంవత్సరంలోనే లూయిస్ పాశ్చర్ అనే మహనీయుడు కుక్క కాటుకు టీకాను కనుగొన్నాడు. అంటే 134 సంవత్సరాల క్రితం ఈ రేబిస్ వ్యాధి కి టీకా అనుకొన్నపటికీ వ్యాధి నివారణ మాత్రం జరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 60 వేల మంది రేబీస్ వ్యాధితో చనిపోతున్నారు ఇందులో 20 వేల మంది మన దేశంలోని వారే చనిపోతున్నారు. ఈ రేబిస్ వ్యాధి సంక్రమించేది కుక్క కాటు ద్వారా మాత్రమే కాదు.నక్క ,పిల్లి,కోతి, గబ్బిలం లాంటి జంతువులు కరవడం ద్వారా కూడా సంక్రమించ వచ్ఛు.భారత దేశములో 98% మంది లో రేబీస్ వ్యాధికి కారణం కుక్క కాటే. రేబిస్ వ్యాక్సిన్ ఎలా వేయించుకోవాలి? కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు వేస్తారని గతంలో ఉన్నటువంటి వైద్య సూత్రం. ఇప్పుడు బొడ్డుచుట్టూ వేసే టీకా అనేక దేశాల్లో రద్దు చేయ బడింది. 2004నుంచి మన దేశంలో కూడా రద్దు చేయబడింది. ఇప్పుడు కండలోకి వేసే టీకా అందుబాటులోకి వచ్చింది. ఈ టీకాను ఐదు విడతలుగా వేయించుకోవాలి. మొదటి డోసు కరిచిన వెంటనే, రెండవ డోసు మూడవరోజు, మూడవ డోసు ఏడవ రోజు, నాలుగవ డోసు 28వ రోజు. (0-3-7-14-28). ఈ 5 విడుదల టీకా ఖర్చు సుమారు 2000 రూపాయలు అవుతుంది.ఈ ఖర్చును పేదలు భరించడం కష్టం. ఖర్చును తగ్గించడానికి పరిశోధనలు జరిపి ప్రస్తుతం చర్మంలోకి వేసే టీకాను కనుగొన్నారు. ఈ టీకాను నాలుగు విడతలుగా వేయించుకోవాలి (0-3-7-28) దీని మొత్తం ఖర్చు సుమారు 400 రూపాయలు.. ఈ టీకాను ఎప్పుడు వేయించుకోవాలి? కరిచిన వెంటనే వీలైనంత త్వరగా టీకా వేయించుకోవడం మంచిది. మనలను కరిచిన కుక్క మంచిదో, పిచ్చిదో మనం గుర్తించడం కష్టం. మొదటి మరియు రెండవ డోసును వేయించుకుని, మనల్ని కరిచిన కుక్కను గమనించడం సాధ్యం కాకపోయినా, కుక్క చనిపోయినా ఏడవ రోజు వేయించుకోవాల్సిన మూడవ డోసును తప్పక వేయించుకోవాలి. కుక్క బ్రతికుంటే మిగిలిన డోసులను వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ జాగ్రత్తలు కుక్క కరిచినప్పుడే కాదు, పిల్లి, కోతి, నక్క, గబ్బిలం, గాడిద, గుర్రం ఇలాంటి జంతువులు కరిచినప్పుడు కూడా ఇవే జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ యం.వి.రమణయ్య, రామచంద్రారెడ్డి హాస్సిటల్, నెల్లూరు రాష్ట్ర అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక
సూళ్లూరుపేట : సూళ్లూరుపేట అనగానే గుర్తొచ్చేవి కాళంగినది, ఆ నదీ తీరాన వెలసివున్న పరమ పావని శ్రీ చెంగాళమ్మ అమ్మవారు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాకెట్ కేంద్రం శ్రీహరికోట, అతి ప్రాచీనమైన మన్నారుపోలూరులోని రాజగోపాలస్వామి ఆలయం. తెలుగు, తమిళ సాంప్రదాయాల మేలుకలయిక సూళ్లూరుపేట. సుళ్ళూరుపేటకు చెంగాళమ్మ ఆలయం వల్ల ఈ పేరు వచ్చింది. అది ఎలాగంటే చెంగాలమ్మ గుడికి ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పెద్ద కర్రకు మేకని కట్టి మూడు సార్లు గాలిలో తిప్పుతారు. సుళ్ళు తిరుగుతున్న నీటిలో దొరికిన దానికి గుర్తుగా ఇలా తిప్పటం జరుగుతున్నది. ఈ విధంగా తిప్పడాన్ని ”సుళ్ళు ఉత్సవం” అంటారు. ఆ విధంగా ఈ ఊరికి సూళ్ళురుపేట అని పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని దర్శించుకొనేందుకు రోజూ 2 వేల మంది వస్తుంటారు. తడ : మనజిల్లాకు సరిహద్దు మండలం ‘తడ’. తడ వృక్షాలు ఎక్కువగా వున్న ప్రాంతం ‘తడ’గా పిలవబడింది. తడ అంటే ధన్వమనెడు చెట్టు. ధనుర్వుక్షం అని కూడా అంటారు. దీని కట్టెలు ఇండ్లకు, ఆకులు విస్తళ్లకు ఉపయోగిస్తారు. పెళ్ళకూరు : యుద్ధంలో వీరస్వర్గం అలంకరించిన ఒక వీరుని పేరు మీద ఏర్పడిన గ్రామం తాళ్వాయిపాడు. బండ్లమాంబ వారి చండికా పరమేశ్వరి ఆలయం, పాఠశాల ఈ మండలం ప్రత్యేకతలు.
”వైద్యం చాలా పవిత్రమైనది” ”వైద్యుడు నారాయణుడితో సమానం” ఇవి వారసత్వంగా కొనసాగుతున్న భావాలు. కాలం మారుతుంది. జనం మారుతున్నారు. వారి ఆలోచనా విధానం మారుతుంది. గతంలో మాదిరి వైద్యం చెయ్యాలంటే ఏ ఆకునో, కాయనో నూరి మందుగా ఇవ్వటం కుదరదు ఇస్తే జనం ఒప్పుకోరు. ఎంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా కొన్ని జబ్బులకు వైద్యం లేదు. కొన్ని జబ్బులు బతికినంత కాలం ఉంటాయి. ఇం కొన్ని జబ్బులు తగ్గటానికి నెలలు, సంవత్స రాలు పట్టొచ్చు. మరికొన్ని జబ్బులు వాటి జ్ఞాపకాలను, అవశేషాలను వదిలిపోతాయి. ఇవి ఆయా జబ్బుల స్వభావం. ఆపరేషను చేయాల్సిన కేసుల్లో సర్జరీ మొదలైనప్పటి నుంచి రోగి కోలుకొనే వరకూ కేవలం డాక్టరు సమర్ధతే చాలదు. సమస్య తీవ్రత, రోగి శరీరం తట్టు కొనే తీరు, మందుల ప్రభావం, వసతులు, రోగి చెల్లింపు సామర్థ్యం మొదలైనవన్నీ వాటి వాటి స్థాయిలో కలిసి రావాలి. వాస్తవ పరి స్థితి ఒక రకంగా ఉంటుంది. రోగి దాన్ని అర్థం చేసుకొనే తీరును బట్టి వారి ఆశింపు మరో రకంగా ఉంటుంది. జనానికి ఆధునిక వైద్యం కావాలి. వైద్యంలో నాణ్యత ఉండాలి. రోగి ఆసుపత్రిలో అడుగు పెట్టే సమయానికి అన్నీ అమరినట్టు ఉండాలి. బాధతో ఉన్నప్పుడు వైద్యం ఆలస్యం కాకుడదు. త్వరగా జబ్బు తగ్గిపోవాలి. ఇవి సగటు రోగి ఆశింపు. రోగి ఆశించినట్టు వైద్య సేవలు అందిం చాలంటే డాక్టరు పూర్తిగా సమర్ధుడై ఉండాలి. వైద్యాన్ని బాగా నేర్చుకోవాలి, కొత్త కొత్త పోక డల్ని నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి. అందుకు వృత్తిపరమయిన ”కాన్ఫెరెన్స్”లకు పోతూ ఉండాలి. ఎడిషను మారినప్పుడల్లా కొత్త పుస్తకాలు మారుస్తూ ఉండాలి. జర్న ళ్ళుకు చందా కడుతూనే ఉండాలి. అన్నింటికి మించి నిరంతరం చదువుతూనే ఉండాలి. రోగం చేయటంలో ఏమయినా తేడా వచ్చి వినియోగదారుల ఫారంలో కేసు పడవచ్చు. ఇన్ని కష్టాలు పడే మాకు కష్టానికి తగ్గట్టు డబ్బులు ఫీజు రూపంలో రావొద్దూ? ఇది రోగి ఆశింపుపై సగటు డాక్టరు కామెంటు. మరో వైపు డాక్టరుకి సామాజిక బాధ్యత ఉండాలని సమాజం ఖచ్చింగా ఆశిస్తుంది. ఇంజనీర్లకు, టీచర్లకూ, లాయర్లకూ, చార్టెడు అకౌంటెట్లకూ ఇలా ఒకరనేం ఎవరికీ సామాజికి బాధ్యతని జనం గుర్తు చేయరు. ఐ.ఐ. టీ.లో, ఐ.ఐ.ఎం.లో ప్రజల డబ్బుతో చదివిన వారిని సమాజం పట్ల మీ బాధ్యత ఏమిటని ఎవరూ అడగరు. వారు సమాజం డబ్బుతో చదవరా? కేవలం డాక్టరు మాత్రమే జనం డబ్బుతో చదువుతారా? డాక్టర్లు మాత్రమే జనాల సేవలో తరించాలా? వైద్యుల మీద చర్చవచ్చిన ప్రతిసారీ డాక్టర్లు ముందుకు తెచ్చే ప్రశ్నలు ఇవి. కొన్ని వాస్తవాలు కూడా గమనించాలి. వైద్యుడిని దేవుడిగా నెత్తిన పెట్టుకొనే జనం వైద్యంలో ఎక్కడైనా తేడా వస్తే ఊరకనే వుం డరు. అదే ”దేవుడు” తిట్లు తినాలి. కొన్ని సార్లు తన్నులు తినాలి. మంచి సిటిజను అయితే ఇవేమీ చేయకుండా కోర్టుకు తిప్పుతాడు. మంచి డాక్టరుగా తయారవ్వమని ఆదేశించమని కాదు. నాకు డబ్బులు కట్టించమని. వైద్యులకూ, డాక్టర్లకూ మధ్య ఈ విధమైన వైవిధ్యాలు రావ టానికి కారణం ఏమిటంటే ”డాక్టరు-పేషంటు” మధ్య సంబం ధాలను వాస్తవ దృష్టితో అర్థం చేసుకోలేక పోవటమే. సమాజంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృ తిక అంశాలలో మార్పులు అని వార్యం. వాటి తో పాటే మానవ సంబంధాలు మారిపోతాయి. పూటకూళ్ళ వారి ఇళ్ళు రెస్టారెంట్లు అయినట్టు, సత్రాలు స్టారు ¬ట ళ్ళు అయి నట్టు, వైద్యాన్ని డబ్బులు తీసుకొని చేసే సేవగా గుర్తించ కుండా పవిత్రమైనదిగా, డాక్ట రును దేవు డిలా, దయామయుడిలా, శాంత మూర్తిగా, రోగ పీడత దరిద్ర నారాయణులను ఆదుకొనే అవ తార మూర్తిగా భావించి నైతిక తను ఆశిస్తే ఎలా కుదురుతుందీ? జనం మారి, వైద్యం మారి, వైద్య పద్ధ తులు మారి, వైద్యానికి సంబంధించి మగతా అన్ని మారినా వైద్యుల్ని చూడటంలో జనం ఆలోచనలు మాత్రం అలాగే ఉన్నాయి. అందుకే జనం ఆశింపుకూ, వైద్యుల ప్రవర్తనకూ మధ్య అంత అంతరం. మారిన కాలంతోపాటు. డాక్టర్లూ మారు తారు. వారు చేసే వైద్యమూ మారుతుంది. దానికి తగ్గ ఖర్చూ పెరుగుతుంది. మార్పులన్నీ సామాజంలో వచ్చే మొత్తంలో భాగంగానే వుం టుంది. ఈ దృష్టిలో ఉంచుకొని డాక్టరు- పేషంటు సంబంధాన్ని చూస్తే వారి మధ్య సంబంధాలు సజావుగానే ఉంటాయి. లేదంటే పరస్పరం అనుమానంతోనే కలిసి నడవాలి. మిగతా వారిని వదిలేసి డాక్టర్ల నుండి మాత్రమే సామాజిక బాధ్యతను ఆశించటంలో మరో కనపడని కోణం కూడా ఉంది. అదేమి టంటే రోగం వ్యక్తిని ప్రత్యక్షంగా బాధకు గురి చేస్తుంది. దాన్నుండి విముక్తి పొందాలంటే డాక్ట రుతో ప్రత్యక్ష సంబంధం అవసరం. అలాగే ప్రత్యక్ష చెల్లిపు కూడా చెయ్యాలి. ఆ చెల్లింపు మనసులో ”ఆయిష్టమైన చెల్లింపు” ఎలానో చూద్దాం. రోగం రావటం ఎవరికీ ఇష్టం ఉండదు. అయినా రాకుండా ఉండవు. వచ్చాక వైద్యం చేయించుకోవటమూ తప్పదు. ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చక పోయినా డాక్టరు దగ్గరకో, ఆసుపత్రికో వెళ్ళి చూపించుకొని వైద్యం చేయించు కోవాలి. అంటే జబ్బున పడ్డప్పుడు డాక్టరు-రోగి సంబంధం అనివార్యమూ, అవసరము. మనిషి అవసరాలు మొత్తం రెండు రకాలుగా ఉంటాయి. మొదటి రకం మన కు కావాల్సినవి, మనం ఇష్టపడేవి, మనకు ఆనం దాన్ని ఇచ్చేవి. వీటికోసం మనమే వెంపర్లా డుతాం. ఖరీదు అయిన టీవీని కొనటం, ఆరు రెట్లు ఎక్కువ ధర చెల్లించి మనకు నచ్చిన హీరో సినిమా టికెట్టును బ్లాకులో కొనటం, దాహం వేసినప్పుడు కోకకోలా తాగటం, మందు తాగటం. ఇవి ఇష్టమైన అవసరాలు కాబట్టి ఎంత ఖర్చు అయిందనే దానితో లెక్క లేదు. రెండో రకం అవసరాలు మనకు ఇష్టం లేనివి. ఇష్టం లేకపోయినా అవసరం కాబట్టి అవి తీరాలి. కోర్టులో కేసు, రోగం వచ్చినప్పుడు వైద్యం. ఇవి వచ్చాయి కాబట్టి అవసరాలు అవుతాయికానీ నిజానికి మనమేం కోరుకోలేదు. ఇందులో లోతుపాతులు మనకు తెలియదు కాబట్టి నిపుణుల సహాయం తప్పని సరిగా కావాలి. వారికి డబ్బు చెల్లించాలి. కాబట్టి వీటి మీద ఖర్చు పెట్టటానికి అయిష్టంగానే ఉంటుంది. నెలకు పదివేల రూపాయలు ఆలో చించకుండా ‘మందు’కు ఖర్చుపెట్టే వ్యక్తి దాన్ని మానటానికి వైద్యం చేసిన డాక్టరు బిల్లు అయిదు వేలు కట్టటానికి మనసు ఒప్పదు. దీనికి ఇంత అవుద్దా అని ధర్మ సందేహం. డాక్టరు ఎక్కువ లాగుతున్నాడని లోలోన మధనం. డాక్టర్లు ఊరికే సంపాదిస్తున్నారని నింద. డాక్టర్లకు మానవత్వం లేదని కామెంట్లు. తీవ్రంగా గాయ పడ్డప్పుడు వైద్యం చేయిం చుకోకపోతే ప్రాణం పోతుందనే భయం. తక్షణ ఆపద్బాంధవుడు డాక్టరు ఎక్కడా? త్వర గా రాడే? ఆ పరిస్థితిలో, ఆ సమయంలో రోగి ఆక్రందన అలా వుంటుంది డాక్టరు వచ్చాడు. వైద్యం జరుగుతూ వుంది. ఫరవాలేదు. ఇప్పుడు బాగుంది. ”బిల్లు ఎంత అవుతుందో?” రోగి అను మానం. రోగం తగ్గింది. బిల్లు చేతికి వచ్చింది. అది ఎంతైనా ఉండనీ! ”అమ్మ బాబోయ్ ఇంతా? ఈ డాక్టర్లుకు కరుణ లేదు. దారుణంగా దోచేసుకుంటు న్నారు” ఏం పెద్ద ఊడబొడిచారనీ” ఇవి జబ్బు నయం అయ్యాక, సగటు రోగి ఆలోచనలు. దీనికి కారణం ఇష్టం లేని ‘అవసరం’ కోసం చెల్లిం చాల్సి రావటమే. అందుకేే రోగికి డాక్టరు, ప్రాణం పోయేట ప్పుడు దేవుడుగానూ, రోగం తగ్గేటప్పుడు స్నేహి తుడిగా, బిల్లు కట్టించుకొనేటప్బుడు యముడిలా కనిపిస్తాడని ఒక ఆధునిక నానుడి పుట్టుకు వచ్చింది.చేయించుకున్న వైద్యానికి బిల్లు కట్టాల్సి వచ్చినప్పుడు రోగి మనసులో ”అవసరము- అయిష్టత” పునాదిగా ఆలోచిస్తారు. మారిన సామాజిక నేపథ్యంలో వైద్యం చేసే డాక్టరు ”సేవ-ప్రతిఫలం” అనే ఆలోచనల పునాదిగా ఫీజును ఆశిస్తాడు. ఈ రెండింటి మధ్య పొంతన ఎంత చెడిపోతే డాక్టరు-రోగి మధ్య సంబంధం కూడా అంతగా దెబ్బ తింటుంది. రోగి-డాక్టరు మధ్య సంబంధాలను వ్యా పార సంబంధాలుగా పరిగణించి ”వినియోగ దారుల చట్టం” పరిధిలోకి తెచ్చాక కూడా ”సేవ- దయ” అనే పాత పునాదుల పై నుండి వైద్యాన్ని చూడటం సరికాదు. ”సేవకు తగ్గ చెల్లింపు” రోగికి ఉండాలి. అలాగే ”చెల్లించిన దానికి నాణ్యమైన సేవ”ను డాక్టర్లు అలవరుచు కోవాలి. అంటే రోగి మంచి వినియోగదారుడై ఉండాలి. డాక్టరు నమ్మకమైన, నాణ్యత అందించగల ”సర్వీసు ప్రొవైడరు” అయి ఉం డాలి. సేవకు తగ్గట్టు చెల్లించని మనస్తత్వం రోగికి ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో దాన్ని రాబట్టుకొనే విధంగా వైద్యులు ఉంటారు. వైద్యం అనే రైలు నడవాలంటే దానికి రోగి- వైద్యుడు రెండు పట్టాల్లాంటి వారు. ఒక పట్టా అదుపు తప్పి, రెండో దాన్ని అదుపు తప్ప కుండా బాగుండమని ఆశించటం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో వినియోగదారుడు వైద్యుల పట్ల తమ దృక్పధం మార్చుకోవాలి. వాటిలో ముఖ్యమైనవి., 1. వైద్య వృత్తి పవిత్రమయినది కాదు. కట్టిన డబ్బుకు అందించే వినిమయ సేవ మాత్రమే. 2. డాక్టరు గొప్పవాడేం కాదు. అన్నీ పనుల్లో నిపుణులు ఉన్నట్టే డాక్టరు కూడా కేవలం వృత్తి నిపుణుడు మాత్రమే. 3. డాక్టర్లంతా మేధావులు కాదు. అందరిలో ఉన్నట్టే డాక్టర్లలో కూడా మేథావులు వుంటారు. 4. డాక్టరు చదువును దృష్టిలో ఉంచుకొని వైద్యం నాణ్యతను ఆశించాలి. ప్రతి డాక్టరుకు అన్నీ తెలిసి ఉండవు. 5. ఒకే డిగ్రీ చదివిన స్పెషలిస్టులకు మధ్య కూడా నక్కకూ, నాగలోకానికి మధ్య వున్నంత తేడా వుంటుంది. 6. సమాజంలో ఉండే అన్నీ రుగ్మతలు వైద్య వ్యవస్థలోనూ, వైద్యుల్లోనూ ఉంటాయి. 7. ప్రభుత్వ డాక్టర్లు ధర్మంగానో, దయతోనో వైద్యం చేయటం లేదు. వారికి ప్రజల తరుఫున ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుంది. డాక్టర్ పి. శ్రీనివాసతేజ, నెల్లూరు
నెల్లూరు జిల్లా ముత్తుకూరుకు ఆ పేరెలా వచ్చింది దాదాపు వెయ్యేళ్ల కిందటే ముత్తుకూరు ఒక ప్రసిద్ధ గ్రామం. సమీపాన వున్న కృష్ణపట్నం రేవు ద్వారా ముత్తుకూరుకు ఎంతో ప్రాధాన్యం వుండేది. ముత్యాల ఎగుమతి జరగడం వలన ఆ వూరికి ఆ పేరు వచ్చిందంటారు. 13వ శతాబ్ధంలో సింహపురిని ఏలిన మనుమసిద్ధి తండ్రికి ‘గండగోపాల’ అనే బిరుదు వుండేది. ఆయన కాలంలోనే సిద్ధేశ్వరాలయం నిర్మించబడింది. మనుమసిద్ధి కాలంలో అభివృద్ధి పరచబడి, మనుమసిద్ధేశ్వరాలయం అయ్యింది. కృష్ణపట్నాన్ని అప్పట్లో గండగోపాలపట్నం అని కూడా పిలిచేవారు. ప్రాచీన కాలంలో కృష్ణపట్నానికి ‘కొల్లితురై’ అనే పేరుండేది. తురై అంటే రేవుపట్నం. దీన్ని బట్టి ముత్తుకూరు, దాని పరిసరాలు ప్రాచీనకాలంలోనే ఎగుమతులు, దిగుమతులకు ఆలవాలమై విదేశీ వ్యాపారానికి పేరెన్నికగన్నవని చెప్పవచ్చు. ప్రస్తుతం ముత్తుకూరుకు కూతవేటు దూరంలో ప్రపంచంలో గొప్ప రేవుపట్టణాలలో ఒకటిగాను, మన రాష్ట్రంలో ఆర్థిక వనరులను సృష్టించేందుకు నెంబర్ వన్‌గాను కృష్ణపట్నం ఓడ రేవు వెలుగొందుతుంది. కృష్ణపట్నం వలనే ప్రస్తుతం ముత్తుకూరుకు ప్రపంచ స్థాయి ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌ల యుగం నడుస్తోంది. అదే ఇప్పుడు సరికొత్త జబ్బులకు కారణమవుతోంది. చేతిలో సెల్‌ఫోన్ లేకుండా ఉండలేకపోవడాన్నే నో మొబైల్ ఫోన్ ఫోబియా అని వైద్యులు చెబుతున్నారు. యువకులు, ఉద్యోగులు, బిజినెస్ పర్సన్స్ లో ఈసమస్య అధికంగా ఉన్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు. మొన్నటి వరకు విదేశాలకే పరిమితమైన ఈ సమస్య మనదేశంలోనూ ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ప్రేమ జంటలపై ప్రభావం చూపుతోంది. నో మొబైల్ ఫోన్ ఫోబియా అంశం ఐదేళ్ల క్రితమే గుర్తించారు. గతంతో పోలిస్తే.. ఈ సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది.స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో 66 శాతం మంది ఇప్పుడు నోమో ఫోబియా బారినపడుతున్నారు. నోమో ఫోబియా ఉన్నవారు ఫోన్ ను ఒక్కసారి కూడా స్విచ్ఛాఫ్ చేయరట. బాత్ రూమ్‌కి వెళ్లిన ఫోన్‌ను వదలరట. ఫోన్ రింగ్ కాకపోయిన అయినట్టు భ్రమపడతారట. సాధారణ వినియోగదారుల కంటే కొందరు మొబైల్‌ఫోన్‌కు దూరమై బతకలేమంటున్నారు.. కొందరు ఫోన్ దూరమైతే తీవ్ర డిప్రెషన్లోకి వెళతామంటున్నారు. మానసిక సమస్యల జాబితాలో ఈ సమస్యను కూడా చేర్చాలా వద్దా అన్నదానిపై చర్చ మొదలైంది. మొబైల్ వినియోగదారుల్లో నోమో ఫోబియా ఉందో లేదో తెలుసుకునేందుకు అమెరికాలో పూర్తిస్థాయి పరిశోధకులు కూడా మొదలయ్యాయి. ఈ సందర్భంగా కొంత మంది మేధావులు ఫోను వాడడం తప్పు అని మాత్రం అనడం లేదు. ఏ మేరకు ఉపయోగించాలో ఉపయోగించుకుంటూ కనీసం రాత్రి పడుకునేటప్పుడు ఒక మంచి పుస్తకాన్ని చదవడం, చదివిన విషయాలను కుటుంబ సభ్యులతో కలిసి భోజన సమయంలో చర్చించుకోవడం, మిత్రులు కలిసినప్పుడు పై విషయాలను చర్చించడం, తను పాటించడం మంచిదని సలహా ఇస్తున్నారు.
పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం. రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.