Tuesday, 9 December 2025

Blog

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ప్రతిఒక్కరు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని దీనికి తమ వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని మిత్ర ఫౌండేషన్ చైర్మన్ షేక్. షబ్బీర్ భరోసానిచ్చారు. గూడూరులోని విందూరు మిత్ర ఎస్టీ కాలనిలో 5వ తేది సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  పేదవారి బిడ్డల చదువు మధ్యలో ఆగిపోకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిందని అయిన కొంతమంది ఏవో కారణాలతో డ్రాపౌట్స్ గా మిగిలిపోతున్నారని ఆవేదన చెందారు. అలాంటి వారికోసం తమ సంస్థ అన్నిరకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఈ సందర్బంగా అక్కడి పేద విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, పలకలు, ఛార్ట్స్, పరీక్షలకు అవసరమగు మెటీరియల్స్ తదితర సామాగ్రిని అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణ మరియు పట్టుదలతో చదవాలని, అలాగే ఎవరైనా క్రీడాకారులు వుంటే వారిని గుర్తించి తగిన క్రీడా వస్తుసామాగ్రిని అందిస్తామని షబ్బీర్  పేర్కొన్నారు. ఆరోగ్య విషయంలో విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని షబ్బీర్ ఉపదేశిస్తూ విద్యార్థులు మంచి ఆరోగ్య అలవాట్లను అలవర్చుకోవాలని వారికి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం విందూరు మిత్ర ST కాలనీలో నివసిస్తున్న 30 కుటుంబాలకు మరియు చిన్న పిల్లలకు బ్రెడ్, పాలు, పాయసం, ఆపిల్ పండ్లుతో పాటు మరికొన్ని వస్తువులను  అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలని ప్రజలతోపాటు షేక్.అబ్దుల్లా, జాఫర్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ

దేశంలో సహకార వ్యవస్థ పరిస్థితి బాగు

నెల్లూరు ఎంపీ ఆదాలకు కేంద్ర మంత్రి సమాధానం దేశంలోని రాష్ట్ర, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందని ఆర్బీఐ ప్రశంసించి నట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్సభలో రాతపూర్వకంగా సోమవారం తెలిపారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి దేశంలోని కేంద్ర సహకార బ్యాంకుల పరిస్థితి గురించి అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా జవాబు చెప్పారు. అలాగే ఈ బ్యాంకుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని కూడా ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి సమాధానం చెబుతూ సహకార వ్యవస్థను పటిష్టపరిచేందుకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకు (నాబార్డు) పలు చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.రుణ పంపిణీ, వసూళ్ల కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 33 రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్రాల్లో 363 సహకార బ్యాంకులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి ఏడాది రుణ కేటాయింపు మొత్తం పెరుగుతోందని తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం బ్యాంకులు లాభాల్లో ఉన్నాయని స్పష్టం చేశారు.

Featured ఆంధ్రప్రదేశ్

జాతీయ ప్రతిభా పురస్కారాలు ఎవరికి ఇస్తున్నారు? లోక్సభలో ప్రశ్నించిన ఎంపీ ఆదాల

జాతీయ ప్రతిభా పురస్కారాలు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఏ విధంగా ఉపకరిస్తున్నాయని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం లోక్సభలో ప్రశ్నించారు. ఈ ప్రతిభా పురస్కారాలు ఎంత మంది విద్యార్థులకు అందుతున్నాయని ,వాటికి ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మానవ వనరుల శాఖ మాత్యులు రమేష్ పాఖ్రి యల్ నిశాంక్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2008 నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అంద జేస్తున్నామని తెలిపారు. చదువును కొనసాగించలేని వారికి ప్రోత్సాహకంగా ఈ పురస్కారం కింద లక్ష రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నామని తెలిపారు. తొమ్మిదవ తరగతిలో 12 వేల రూపాయలు మొదటిసారిగా అందజేస్తామని, ఇక అక్కడి నుంచి 12వ తరగతి వరకు ఈ పురస్కారం లభిస్తుందని పేర్కొన్నారు .ఎంపిక చేసిన విద్యార్థులు ముఖ్యంగా ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు దీన్ని ప్రత్యేకిం చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ, కేంద్రపాలిత ప్రాంతాలను బట్టి ఈ ప్రతిభా పురస్కారాలు మొత్తం నిర్ణయమవుతుందని పేర్కొన్నారు ఈ పరీక్షను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. 18. 75 లక్షల రూపాయలను మంజూరు చేశామని, లక్షా 36 వేల 239 స్కాలర్షిప్పులు దేశవ్యాప్తంగా అందజేస్తున్నామని, ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందని స్పష్టం చేశారు. ఈ స్కాలర్షిప్పుల వల్ల ఎంతోమంది తమ చదువు కొనసాగించారనే సంఖ్య తమ వద్ద లేదని తెలిపారు. పర్యాటక కాలుష్యం వల్ల ఇబ్బంది లేదు దేశంలోని పర్యాటక ప్రాంతాల వల్ల పర్యాటకుల ఆరోగ్యానికి ఎటువంటి నష్టం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సోమవారం లోక్సభలో రాతపూర్వకంగా తెలిపారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్సభలో పర్యాటక ప్రాంతాల్లో నీటి, వాయు కాలుష్యం గురించి ప్రశ్నించారు .పర్యాటక కేంద్రాల వల్ల పర్యాటకుల ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం ఉందని కూడా ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి సమాధాన మిస్తూ, ఇంతవరకూ పర్యాటక ప్రాంతాల కాలుష్యం వల్ల పర్యాటకులు జబ్బున పడిన దాఖలాలు లేవని, అటువంటి విషయం తమ దృష్టికి రాలేదని స్పష్టం చేశారు. కేంద్ర కాలుష్య మండలి తమ శాఖల ద్వారా దేశంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పర్యాటకుల ద్వారా గత మూడేళ్లలో 85. 858 యుఎస్ మిలియన్ డాలర్లను విదేశీ మారక ద్రవ్యంగా ఆర్జించినట్లు తెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

మతసామరస్యానికి చిహ్నం శ్రీ కృష్ణదాసుమఠం

(పున్నమి ప్రతినిధి గూడూరు): అవధూత కృష్ణదాసు స్వామి మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనమని ప్రముఖ పురావస్తు శాస్త్రజ్ఞులు ఏసుబాబు గారు చెప్పారు. శుక్రవారం నాటి సాయంత్రం గూడూరులోని రాణీపేట పరిసరాల్లో ఉన్న శ్రీకృష్ణదాసు మఠాన్ని దక్షిణ భారతదేశ పురావస్తు శాఖ, చెన్నై తెలుగు శాసన అధ్యయన విభాగానికి చెందిన అధిపతి ఎం.ఏసుబాబుగారు సందర్శించారు. మఠానికి చెందిన అరుణ్ కుమార్, సాయివరప్రసాద్ల అభ్యర్ధన మేరకు వారు తమ బృంద సభ్యులైన యుగంధర్, సత్యలతో  రావడం జరిగింది. వీరు మఠంలోని శాసనాన్ని కాపీ చేసి దాని విశిష్టతను వివరించడం జరిగింది. ఈ శాసనం కలియుగ సంవత్సరం 5005 నాటిదని, ద్వాదశ గురుపాద పారంపర్యానికి చెందిన అన్నవదూత స్వామి వారి శిష్యులు మరియు హుస్సేన్ గారి శిష్యులు అయిన శ్రీకృష్ణదాసు గారు మాఘమాస బహుళ నవమి జేష్టానక్షత్రమున, గూడూరులో వారి శిష్యులు అయ్యపనేని ఆదెమ్మ గారిచే సమాధి కైంకర్యమును పొందినట్లు ఈ తెలుగు శాసనంలో పేర్కొనబడిందని ఏసుబాబు గారు చెప్పారు. కృష్ణదాసు గారు ఒక మహమ్మదీయుని శిష్యునిగా ఉండటం ఆదర్శనీయమైన అంశమని తెలిపారు. నాటి గొప్ప ఆదర్శాలు నేడు అత్యంత ఆవశ్యకమని కృష్ణదాసులాంటి మహనీయుల చెప్పిన బాటలో అందరూ నడవడం సమాజానికి శ్రేయస్కరమని చెప్పారు. మఠంలో జరుగుతున్న భక్తి కార్యక్రమాల్లో కులమత రహితంగా ప్రజలు పాల్గొనడం ఆనందదాయకమని ఏసుబాబు సెలవిచ్చారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్, శశి, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

వెంకటగిరి కలిమిలమ్మ ఏ కాలానిది 

(పున్నమి ప్రతినిధి గూడూరు) :  నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామానికి ఓ గ్రామ దేవత ఉంది. కాలక్రమంలో  పరిస్థితులను బట్టి అనేక కొత్త దేవతలు వెలిసి పాత కొత్త మేలుకలయిక వల్ల ఎవరు ముందు ఎవరు వెనుక నిర్ణయించడం కాస్త కష్టంగా మారింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ  వెంకటిగిరిలోని కలిమిలమ్మ గ్రామదేవతే అని చెప్పవచ్చు. ఈ కలిమిలమ్మను నేడు కలివేలమ్మగా కూడా భక్తులు కొలుస్తుంటారు. పూర్వం యతిరాజు తిమ్మరాజు అనే గొబ్బూరి వంశస్థుల వారి హయాంలో కలిమిలమ్మ ప్రాచుర్యంలో ఉండేది. అప్పుడు ఈ ప్రాంతాన్ని వెంకటగిరి అని కాకుండా కలిమిలి అనేపేరుతో పిలిచేవారు. వెలుగోటివారు 1628 లో  గొబ్బూరి వంశస్తులను ఓడించి కలిమిలిని (వెంకటగిరి) ఆక్రమించి ఆప్రాంతాన్ని వెంకటగిరిగా పేరుమార్చారు. ఈగొబ్బూరి కులదైవం ఐన కలిమిలమ్మ దేవాలయం నేడు కైవల్యగా పిలవబడుతున్న గుంటిమడుగు నదికి దగ్గర్లో ఉండేది. అలాగే వెలిగొండలలో ఉన్నదుర్గంపైన కూడా కలిమిలమ్మఅనే ఆలయం ఇంకొకటి కూడా ఉండేది. ఈదేవతల పేరుతోనే ఈప్రాంతానికి కలిమిలి అని పేరు వచ్చిఉండొచ్చు. వెలుగోటి రాజు అయిన వెంకతపతి నాయుడు హయాంలో ఈ ప్రాంతము వెంకటగిరిగా మారినట్టు తెలుస్తోంది. అయితే ఈ గ్రామదేవత ఏ కాలానికి చెందినది ఎవరి ప్రాతినిధ్యం కింద ఉండిందో తెలుసుకోవడానికి కావలసిన ఆధారాలు 205 సంవత్సరాయలు క్రితం అగ్నికి ఆహుతి అయినట్లు మెకంజీ స్థానిక చరిత్రలో (కైఫీయతుల్లో) రికార్డు అయివుంది. మెకంజీ కైఫీయతులో ఈ కలిమిలమ్మకు సంభందించి ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తావించబడి ఉంది. వెంకటగిరి కోటకు ఎదురుగా ఉన్న కలిమిలమ్మ దేవాలయంలో మొదట్లో దారు ప్రతిమ ఉండేదట . ఈ ప్రతిమనే  భక్తులు కొలిచేవారు. 1815 వ సంవత్సరంలో దేవాలయ పూజారికి కలలో కన్పించిన కలిమిలమ్మ తాను వెంకటగిరిని వదిలి వెళుతున్నానని  చెప్పిందట. ఆ మరుసటి రోజే కలిమిలి ఆలయంలో నిప్పంటుకుని దేవతావిగ్రహం చాలా వరకు కాలిపోయింది. దీన్ని అరిష్టంగా భావించిన ప్రజలు, జమీందార్లు పూజాదికాలు నిర్వహించి  పాత ప్రతిమ స్థానంలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని మెకంజీ గుమస్తా నారాయణరావు రికార్డు చేయడం జరిగింది. ఇప్పుడున్న విగ్రహం బహుశా కొత్తది కావచ్చు. మరియు ఎలాంటి పురాతన సాక్ష్యాలు అక్కడ లేకపోవడంతో  కలిమిలమ్మను గురించిన సరియైన ఆధారాలు లేకుండా పోయాయి. దీంతో కలిమిలమ్మ ఏ కాలానికి చెందిందో చెప్పడానికి వీలు లేకుండా పోయింది. రాజుల జమానాలో వైభవోపేతంగా వెలిగిన కలిమిలమ్మ కాలక్రమేణా తన వెలుగులను కోల్పోయింది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయినట్లు  కాలక్రమంలో వెంకటగిరి పోలేరమ్మకు ప్రాధాన్యం పెరగడంతో కలిమిలమ్మ దేవత వైభవం మరుగున పడిపోయింది.

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 23వ రోజుకు చేరిన దీక్షలు 

  (గూడూరు పున్నమి ప్రతినిధి) :  స్థానిక పెద్ద మశీదు ఎదుట నల్ల చట్టాలకు నిరసనగా చేపట్టిన దీక్షలు ఆదివారం 23వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం దీక్షలో 20 మంది ముస్లిం, హిందూ సోదరులుకూర్ఛున్నారు. ఈ సందర్భంగా దీక్షల్లో కూర్చున్న మై ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు  షేక్ రాహుల్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రజలు నల్ల చట్టాలపై ఒక అవగాహనకు వచ్చారన్నారు. కేవలంముస్లింలు మాత్రమే కాకుండా ఈ చట్టాలతో దేశంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలందరూ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.లౌకిక దేశంగా గొప్ప ప్రజాస్వామ్య వ్య్వవస్థ గా  పేరుకలిగిన భారతదేశం నేడు ఈ నల్ల చట్టాల వలన తలదించుకొనే పరిస్థితి వచిందని రాహుల్  ఆవేదన వెలిబుచ్చారు.అన్నదమ్ముల వలె కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్న ప్రజలలో అభద్రతా భావంఏర్పడిందని దీన్ని తొలగించాల్సిన అవసరం ఉందని దీనికి ప్రజలందరు ఒకేతాటిపై నడిచి ఈ నల్ల చట్టాలను రూపుమాపాలని కోరారు.     మైనారిటీ నాయకులు ముజాహిద్ మాట్లాడుతూ దేశంలోపుట్టి పెరిగిన వారు దేశ పౌరులుగా నిరూపించుకునే దౌర్భాగ్యం మరే దేశంలోనూ లేదన్నారు. కేవలం హిందూత్వను అమలు చేయాలనే ఏకైక లక్ష్యంతో నల్ల చట్టాలు తీసుకువచ్చారని బీజేపీప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్ఆర్సీ సీఏఏ,  ఎన్పిఆర్ లను రద్దుచేసేంత వరకు  శాంతియుత నిరసన పోరాటాలను ఆపేది లేదన్నారు. ఈ దీక్షలో మన్సూర్, కలీం, హరీ, శ్రీకాంత్, సాధిక్, ఈశ్వర్, షాహిద్, ఫారూఖ్, జునేద్, యశ్వంత్, దావూద్, సాయి, ఇనాముల్, షఫీ మౌలానా, మాబాష, జవాద్ తో పాటు  భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

గోడ కట్టారు గేటు మరిచారు

గోడ కట్టారు గేటు మరిచారు అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైన పాఠశాల ఆవరణం పట్టించుకోని అధికారులు గూడూరు పున్నమి ప్రతినిధి. గూడూరు పట్టణంలోని 7 వార్డు మునిసిపల్ ప్రాధమిక పాఠశాలకు సంబంధించి కొన్ని దశాబ్దాల  తర్వాత ఇటీవల గోడను కట్టడం జరిగింది. తర్వాత .ఏమైందో తెలియదు కాని గోడకు సంబంధించి సిమెంటు పూతను వేయలేదు సరికదా గేటును కూడా  పెట్టకుండా వదిలివేశారు. దీంతో అక్కడ రోజూ మందుబాబులు రాత్రుళ్ళు జల్సా చేయడం కొంతమంది దీన్ని బహిర్భూమిగా వాడుకోవటం పరిపాటి అయింది. చీకటి  కార్యకలాపాలకు నిలయంగా మారడంతో పాఠశాల ఆవరణాన్ని ప్రతిరోజూ విద్యార్థులు, టీచర్లు శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మునిసిపల్ ఆఫీసుకు కూతవేటు దూరంలో, శివాలయంకు పక్కనే ఉన్న ఈ పాఠశాల వెంబడి కొన్ని వందలమంది రాకపోకలు చేస్తుంటారు.ఎవరూ పట్టించుకొనే పాపాన పోరు. ఇక అధికారులు సైతం ఈ దారినే వెళుతూ కూడా పట్టించుకోకపోవడం దారుణమని  స్థానికులు వాపోయారు. ఇకనైనా మునిసిపాలిటీ కమీషనర్ గారు కలుగ చేసుకొని సదరు పాఠశాలకు గేటును మంజూరు చేయవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

శ్రీసిటీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ ల బృందం

పంజాబ్ క్యాడర్ కు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులు తమ స్టడీ టూర్ లో భాగంగా శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ సీనియర్ అధికారి ఎస్.పి.శర్మ వీరికి సాదర స్వాగతం పలికి, పారిశ్రామిక ప్రగతి, మౌలిక వసతులు, ప్రత్యేకతలను వారికి వివరించారు.  శ్రీ సిటీ పట్ల ఎంతో ఆకర్షితులైన ఐఏఎస్ అధికారులు, ఇక్కడ  ప్రణాళిక, అమలు, స్థిరమైన పట్టణీకరణ సూత్రాలు, ఉద్యోగాల కల్పన తదితర అంశాలు చాలా అద్భుతంగా ఉందంటూ  వ్యాఖ్యానించారు. శ్రీసిటీ పరిసరాలు చుట్టిచూడడంతో పాటు, రాక్ వర్త్ పరిశ్రమను వీరు సందర్శించి ఉత్పత్తులను, కార్మికుల పనితీరును పరిశీలించారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఫ్రెండ్స్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్

రాపూరు లో టైలర్స్ డే సందర్భంగా ఫ్రెండ్స్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి టైలర్ల సమస్యలపై నిరుపేద టైలర్ లని ఆదుకోవాలని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ ఆఫీసర్ శాంతకుమారి కి వినతి పత్రం అందజేసినారు ఈ కార్యక్రమంలో రియాజ్ భాషా, ముబారక్, ఖాదర్ భాషా, మహేష్ తదితర టైలర్లు పాల్గొన్నారు

Featured ఆంధ్రప్రదేశ్

నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

రాపూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శనలో విద్యార్థులు సైన్స్ కి సంబంధించిన ఎన్నో ప్రయోగాలు నిర్వహించి ప్రదర్శనలు ఇచ్చి చూపరులను అబ్బుర పరచడం జరిగినది ఇందులో భాగంగా కే.గంగాధర్ 9వ తరగతి విద్యార్థి తన ఉపాధ్యాయుడు N.మునికృష్ణ సహాయ సహకారాలతో ఏర్పాటుచేసిన ఆటోమేటిక్ ఇరిగేషన్ యూజింగ్ సాయిల్ మాయిశ్చర్ సిస్టం నీటి పొదుపు కరెంటు ఉత్పత్తి ప్రయోగానికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎంపిక చేయబడినది ఉపాధ్యాయులు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు మరియు వివిధ పాఠశాల విద్యార్థులు ప్రదర్శనలు తిలకించి సైన్స్ పట్ల ఆసక్తి ఏర్పడిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.