Sunday, 24 May 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్ సాహితీ

అద్దాలమేడ

(బాలపున్నమి) శీనయ్య కష్టజీవి పొద్దస్త మానం పనిచేసి చేతికి వచ్చిన డబ్బులలో మూడొంతులు త్రాగి ఒక వంతు ఇంట్లో ఇచ్చే వాడు. పాపం భార్య సుమతి చాలీచాలని డబ్బుతో ఇల్లు గడపలేక పిల్లలకు సరియైన బట్టలు కుట్టించ లేక, మంచి ఆహరం పెట్టలేక చదువులు చెప్పించ లేక సతమతమౌ తుండేది. అనేక విధాల ఆమె భర్తకు చెప్పిచెప్పి అలసి పోయింది. వారు పడే ఇబ్బందులు గమనించి చుట్టు ప్రక్కలవారు అతనిని, సన్మార్గాన పెట్టాలని విశ్వ ప్రయత్నం చేసి విసిగి వేసారి పోయారు. సంసా రంలో సుఖాలు చిమ్మే పన్నీరు వదలి వళ్ళుమరిచి అనారోగ్యానికిలోనయ్యే బురదలో వరాహం పొర్లాడుతానంటే ఎవరు కాదనగలరు? ఎంత మంది ఎన్ని రకాలుగా పోరాడినా అతనిలో మార్పు కనిపించక సంసారం గుడ్డెద్దు బండి లాగి నట్టుగా తయారైంది ఒకరోజు అతని ఇంటి ముందుకు ఒక సాధువు బిక్షకు వచ్చాడు ఆయన ప్రత్యేకత ఏమిటంటే మనం దోసిట నిండా బియ్యం తీసుకుపోయినా రెండేళ్ళతో వచ్చినన్ని బియ్యం తీసుకుని నవ్వుతూ దీవించి వెళ్ళిపోతాడు. అలాగే సుమతి తెచ్చిన బియ్యాన్ని తీసుకుని శీనయ్యను ఆయన సంసారాన్ని పరిశీలనగా చూసి ‘‘అయ్యా! తమరు తొందరలో అద్దాలమేడ కడ తారు. ఈ మాటలు నావి కావు అమ్మవారు నానోట పలికిస్తుంది అని శీనయ్యకు చెప్పి తన దారిన వెళ్ళి పోయాడు సాధువు. మద్యాన్నం తింటే మాపిటకు ఎలా చేద్దామా అనే దశలో మేముంటే, అద్దాల మేడ కడతామంట ఇలాంటి పిచ్చోళ్ళు వుండ బట్టే మన దేశం ఇలా తగలెడెతోంది అని తనలో తాను నవ్వుకున్నాడు శీనయ్య. సాధువు మాటలు విన్న సుమతి ఒక కాగితంపై త్వరలో అద్దాల మేడ కడతాము అని వ్రాసి గొడకు అతికించింది. రోజు ఆ అక్షరాలను చదువుతున్నాడు మన శీనయ్య తినగ తినగ వేము తియ్య నైనట్టుగా మరల మరల నెమరు వేసు కోవ టంతో సాధువు మాటలు మనసులో నాటుకు పోయాయి శీనయ్యకు ‘‘ఏమి వ్యాపా రం చేయాలన్నా మనకు పెట్టుబడి ఎవడి స్తాడు? అన్నాడు ఒకరోజు సుమతితో తలగీరు కుంటూ శీనయ్య. శీనయ్య త్రాగి గుట్టవేసిన శీసాలను అమ్మి కొంత డబ్బు ఇచ్చింది సుమతి. ఆ డబ్బుతో ఎర్రగడ్డల వ్యాపారం పెట్టాడు. అందులో వచ్చిన డబ్బుతో బొరుగుల మిక్చరు బండి వేశాడు. అలా అలా నాలుగు రకాలు కనపడటంతో త్రాగుడు పూర్తిగా మాని వేశాడు. ఇదే సమయమని భర్త తెచ్చిన డబ్బును జాగ్రత్తగా దాచింది సుమతి. మనిషి తలచుకుంటే చేయలేనిదేదీ వుండ దని ఉడుంపట్టు పట్టాడు శీనయ్య. చాలా డబ్బు పోగేశారు కూడా. కొద్దికాలం తర్వాత మేడకు పునాదులు త్రవ్వి అనతికాలంలోనే అద్దాలమేడ నిర్మించి అన్నంత పని చేసి చూపించారు. బంధువు లందరినీ పిలిచి గర్వంగా గృహప్రవేశం చేశారు. వారు పిల్లాపాపలు ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. ఒకరోజు సాధువు వచ్చాడు. శీనయ్య ఇల్లును చూచి ముక్కున వేలుంచుకున్నాడు. అంతలో దంపతులు ఆయన కాళ్ళపై బడి నమస్కరించి తమ దయవల్ల, అమ్మ ఆశ్వీర్వాదం వల్ల అద్దాల మేడను కట్టుకున్నాము. ఏమిచ్చి మీరుణం తీర్చు కోగలము? అన్నారు. సాధువు ముసిముసిగా నవ్వుతూ ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. అంతా నీ భార్య గొప్పతనమే. ఒక రోజు నాదగ్గరకు వచ్చి నీ సంగతంతా చెప్పి ఏడ్చింది. మార్పురావాలని నీలో ప్రేరణ కలగాలని, చూచాయగా అలా అన్నాను. అది మనసులో వుంచుకుని నిజంగానే అద్దాల మేడను నిర్మించుకున్నావు. క్రమశిక్షణ, పట్టుదల అలవరుచుకుంటే ఎంతటి కార్యమైన అవలీలగా సాధించవచ్చు అని నిరూపించావు. నీ సంసారం సుఖంగా వుంది. అంతకు మించి నాకేం కావాలి. నిన్నుచూచి నీలో వచ్చిన మార్పు ను గమనించి మిగిలిన త్రాగు బోతులు మారితే, మన సమాజమే నందనవనమౌతుంది. మంచి మానవత్వం అను పూలుపూచి ప్రేమ దయ, కరుణ అనే సువాసనలు ఇచ్చిన వాడు నాకు నిజమైన ఆనందం కలుగుతుంది, అంటూ నాలు గు గింజలు తీసుకుని తన దారిన వెళ్ళి పోయాడు సాధువు. కృతజ్ఞతతో సాధువు నడచి పోయిన పాద ముద్రలకు నమస్కరించారు దంపతులు.   జంజం కోదండరామయ్య, జమ్మిపాళెము

Featured ఆంధ్రప్రదేశ్ సాహితీ

సహజ సామర్ధ్యం

గొప్ప గొప్ప సాఫ్ట్‌వేర్‌ ‌నిపుణులు, మామూలు ఉద్యోగులకంటే ఏ 10 రెట్లో, 100 రెట్లో కాదు… ఏకంగా 10,000 రెట్లు ఎక్కువ ఉత్పాదకత కలిగిన వారు అంటారు నాధన్‌ ‌మైరో వోల్ట్ , ‌మాజీ మైక్రోసాప్ట్ ‌ముఖ్య శాస్త్రవేత్త.మనలను ఒక రంగంలో జీనియస్‌గా ఉధ్భవింపచేసే ఒక అరుదైన ప్రతిభ ‘ఆపన’ అనే రూపంలో నిగూఢంగా మనందరిలో నిర్రావస్థలో ఉంటుంది.అది చేయడాన్ని మీరు ప్రేమిస్తారు.ఆ పనిని అలవోకగా చేస్తారు.అది తప్ప ఇంకే పని చేయడమైనా మీకు కష్టంగా ఉంటుంది.ఆ ప్రవృత్తినే, మీ వృత్తిగా మలచుకొంటే మీరు ఆనందాన్ని పొందుతూ డబ్బు సంపాదిస్తారు.మనలో ఉన్న టాలెంట్‌ను గుర్తించడం, అది ఇతరులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకోవడం, అదే ఒక జీవిత లక్ష్యంగా మలచుకోవడం – ప్రశాంతత, సంపద రెండూ పొందే సులభ మార్గం. ఒకప్పుడు మనిషి వేటకెళ్ళి బ్రతుకుతెరువు సాగించే వాడు. నాగరికత పెరిగిన తరువాత. కర్మాగారాలు పెట్టి యంత్రాలతో ఉత్పత్తి చేసి జీవించాడు.గత రెండు దశాబ్దాలనుండి సమాచార విప్లవంతో వచ్చిన మార్పుల వల్ల , ఇన్‌ ‌ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ సాయంతో ప్రగతి సాధించాడు.కానీ భవిష్యత్‌లో మేధస్సులే కాక కళాత్మక హృదయం, సృజనాత్మకత, మానవత్వంతో కూడిన నాయకత్వం ఉన్నవారే ఏ రంగంలో అయినా నాయకులుగా ఎదిగే అవకాశముంది.మీరింత గొప్ప జీనియస్‌ ఎలా అయ్యారు అని ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్‌ అనే శాస్త్రవేత్తను అడిగినప్పుడు. ఆయన ఇలా సమాధానం చెప్పారు.‘‘ నేను జీనియస్‌ ‌కాదు కానీ క్యూరియస్‌ అం‌టే కుతూహలంకలవాడిని అలా జీనియస్‌గా రూపొందాను.మీకు ఏరంగంలో అటువంటి క్యూరియాసిటీ ఉందో, ఏ రంగంలో అయితే మీరు పూర్తిగా మమేకమైపోయి కృషి చేయగలరా ఆ రంగాన్ని గుర్తించాలి. ఉన్న సహజ ప్రతిభ మనం ఆయా పనులకు ఎక్స్‌పోజ్‌ అయినప్పుడు బయటపడుతుంది.ఉదాహరణకు, సానియా మీర్జా గారిని 7 సం।।ల వయస్సు ఉన్నప్పుడు ఆమె తండ్రి తనతో పాటు టెన్నిస్‌ ఆడడానికి తీసుకువెళ్ళడట అక్కడ ఒక ఆటగాడు రాకపోయేసరికి ఈ అమ్మాయికి ఆడే అవకాశం వచ్చిందట. ఆ అమ్మాయిలో ఉన్న సహజ ప్రతిభను అక్కడ ఉన్నవారు గుర్తించడం జరిగింది.ఆ అమ్మాయి ఛాంపియన్‌ ‌కావడానికి ఆ తండ్రి అండగా నిలవడంతో ఆ అమ్మాయి తారాపథాన్ని చేరుకోకలిగింది. అలా మనం కూడా ఒక తారాపథాన్ని చేరుకోగల అవకాశం ఒక అరుదైన ప్రతిభ రూపంలో ప్రతి ఒక్కరిలో వేచి చూస్తూ ఉంటుంది.అది బయట వెతికితే దొరకని గని, ఆయిల్‌ ‌కావాలంటే, డ్రిల్‌ ‌చేయాలి. భూ గర్భాల్లో , సముద్ర గర్భాల్లో ఎడారులలో ఎక్కడైన దొరకవచ్చు. కానీ మానవ ప్రతిభ కళాశాలల్లో యూనివర్సిటీలలో దొరకని గని భగవంతుడు ఆ గనిని మానవ హృదయాంతరాలలో నిక్షిప్తం చేసాడు.కానీ మనిషి అన్ని చోట్లకీ పయనిస్తాడు తన అంతరంగంలోకి తప్ప మనందరిలోనూ చాలా టాలెంట్స్ ఉం‌టాయి. కానీ ఒక అసమాన ప్రతిభ , ప్రపంచం ఎదురుచూపే ఒక ప్రత్యేక ప్రతిభ, మీకు సంపదనిచ్చి, ఎల్లకాలం మీకు గౌరవాన్నిచ్చే ప్రతిభ ఒకటి ఉంటుంది. ఆ పని చేయమని మీ మనసు ఎప్పుడూ కోరుతుంటుంది. మన మందరం కావాల నుకుంటే మనం ఊహించలేని మరొక అద్భాత సౌందర్య స్థాయిలో జీవించవచ్చు. అది మన సహజ సిర్ధమైన జీవితం. చిన్న పిల్లలలగా లీనమై ఉండే స్థితి. ఆ స్థితే సత్యమైనది, స్వచ్ఛమైనది. నేనవరు ? అనేదాని మొక్క సంపూర్ణ సారం దానినే యధార్ధమైన స్వీయతత్త్వం ( అధ్లెంటిక్స్ ‌సెల్ఫ్) ‌గా పిలుస్తారు. మీ అంతరంగ లోతుల్లో మాత్రమ కనుగొనబడే మీరైన తత్త్వం అది.మీ వృత్తి , పాత్రను బట్టి నిర్వచింపబడని మీలో భాగం మీ నైపుణ్యాలు, టాలెంట్స్, ‌జ్ఞానం అన్నింటి యొక్క సమాహార రూపం అది. మీరైన సమస్తవలా అదే ! అది వ్యక్తీకరింపబడవలసి, బయటకు వెల్లువై రావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బద్దిపూడి శీనయ్య, నెల్లూరు.

Featured ఆంధ్రప్రదేశ్ సాహితీ

లావొక్కింతయున్‌ ‌లేదు (కథ)

ఓరి దేవుడోయ్‌! ఎం‌తలా వెంతలా వెంతలావు! ఆమె ని చూసి ఆశ్చర్య పోయాడు ఆనంద రావు. అలా ఆశ్చ ర్య పోవడం అదే మొదటి సారి అతని జీవితంలో అంతలా ఎందుకా అశ్చర్య పోయాడంటే? అంతలావున్న ఆడదాన్ని చూడ్డం అదే మొదటిసారి అతని జీవితంలో  ఓరినాయనోయ్‌ ! ఈవిడసలు మనిషేనా? అని అనుకోకుండా ఉండలేకపోయాడామెని చూస్తూ కానీ, రాక్ష సజాతి అనేది ఈభూమ్మీద అంతరించి పోయి చాలా కాలమైంది కాబట్టి, ఆమె మనిషేనని నమ్మక తప్పలేదతగాడికి ఈమెతో పోలిస్తే కల్పనారయ్‌, ఐరన్‌లెగ్‌ ‌శాస్త్రీ ఏపాటి? ఒక ‘పేద్ద’ తక్కెడ తీసుకుని ఒకవైపు ముగ్గురు ఐరన్‌లెగ్‌ ‌శాస్త్రుల్ని వేసి, ఇంకోవైపు ఈమెని ఒక్క దాన్నే వేస్తే… అప్ప టికీ…  ఆ ఊహనే నవ్వొచ్చేసిందతగాడికి. అయినా ఎలాగో తమాయించుకున్నాడు. తను నవ్వడం ఆవిడగాని చూసిందంటే ఇంకే మన్నాఉందా? నన్నుచూసే నవ్వుతున్నావ్‌ ‌గదూ? అని ఒక్క లెంపకాయగాని ఇచ్చిందో – నా ముఖం పచ్చడి కింద నలిగిపోదూ! అట్టి ప్రమాదాన్ని శంకించినవాడై అతి కష్టం మీద నవ్యుని ఆపుకుని ఆమె మీదనుంచి దృష్టిని మరల్చు కోవడానికి ప్రయత్నించాడు ఆనందరావు. అయినప్పటికీ దృష్టి మరలనని మొండి కేసింది ఏదైనా విచిత్రాన్ని చూస్తున్నప్పుడు చూపు మరల్చు కోలేక పోవడం సహజమే కదా ! అంతలో ఆమె అతనికేసి చూసింది.ఆమె తనవైపే చూస్తుండటం చూసి కంగారు పడ్డాడు ఆనందరావు. కానీ, అంతలోనే ఆమె ఆమె తననేం చేస్తుందిలే అని సరి పెట్టుకున్నాడు. తానామెను ఏమన్నా అంటే కదా, తననామె ఏమైనా చెయ్యడానికి? మనసులో సవాలక్ష, అనుకుంటాం ఆవి ఎదుటి వాళ్లకు వినిపించవు కదా! అలా తనకి తానే సర్దిచెప్పుకుని, ధైర్యం తెచ్చుకుని ఆటోకి ఆనుకుని నిలబడ్డాడు ఆనంద రావు. పర్వతం కదిలొచ్చినట్టుగా ఆమె అతన్ని సమీపించింది. ‘‘ ఏమ్‌ ఆటో ! వస్తావా? ’’ శరీరం అంత లావుగా ఉన్నా కంఠం మాత్రం పాపం పీలగానే ఉంది.ఆ మాటవొస్తే పీలగా ఉం డటం కాదు- మృదు మధురంగా ఉంది. ఇంత మధురమైన కంఠ స్వరమున్న ఈస్త్రీ మూర్తికి ఆ దేవుడింత లావు శరీరాన్ని ఎందు కిచ్చాడా ? అనుకున్నాడు బాధగా ఆనందరావు. ‘అబ్బే ! రానండీ ! అన్నాడు భయం భయంగా ఆమెని తన ఆటోలో ఎక్కించుకుంటే ఇంకే మైనా ఉందా? బ్యాక్‌టైర్స్ ‌రెండూ పగిలిపోవూ! బ్యాక్‌టైర్స్ అనే ఏముంది? సీటుతో సహామొత్తం ఆటోనే తుక్కు తుక్కు అయిపోయినా ఆశ్చర్యం లేదు. ‘‘ఏం? ఎందుకు రావు ? కావాలంటే మీటర్‌ ‌మీద ఎంతో కొంత ఎక్స్‌ట్రా తీసుకో అందామె ఉదారంగా. ఎక్స్‌ట్రా అంటే ఎంత ? యాభై ఇచ్చేను, వంద ఇచ్చేను, ఒకవేళ ఆటో తుక్కుతుక్కుయి పోతే – ఆ యాభై, వందలతో తిరిగి బాగవు తుందా? అసలే బ్యాంక్‌లోన్‌ ‌కూడా తీరలే దింకా అదేమాట పైకి అంటే బాగుండదు కాబట్టి, అసలు అనేంత ధైర్యం కూడా లేదు కాబట్టి – అహ అది కాదు మేడమ్‌ ! ‌బండి రిపేరులో ఉంది ’’ అని బొంకేశాడు చటుక్కున అలాగే అన్నట్టు తల పంకించి, ఓ మారు నిట్టుర్చి ఆ మీదట అటు ఇటు చూసిందామె బహుశా ఇంకో ఆటో కోసం కావచ్చు. ‘మా బాగా చూస్తూన్నావేలే గానీ .. తల కాయలో మెదడున్న ఏ వెధవయినా నిన్నసలు ఆటోలో ఎక్కించుకుంటాడా? అనుకున్నాడు ఆనందరావు మనసులో .విపరీతమైన స్థూల కాయంవల్ల నడివయస్కురాల్లా అనిపిస్తుందే తప్ప, నిజానికామె వయసు పాతికేళ్లలోపే ఉంటుంది. మెడలో మంగళసూత్రం, కాళ్లకు మెట్టెలు లేకపోవడం వల్ల ఆమె ఇంకా అవివాహితే అని గ్రహించిన వాడై- బాప్‌రే ! ఈమెను (కు) వరుడు (తగినవాడు) ఈ భూలోకంలో దొరుకుతాడా అసలు ? ఇతర గ్రహాలనుంచి తీసుకురావాల్నా ? అన్యగ్రహాల మీద ఇంత కన్నా లావుగా ఉండే వాళ్లు ఉండటం సులభవమే (!) కాబట్టి ఈమెకు గ్రహాంతర వివాహమే’ శరణ్యం అనుకున్నాడు ఆనంద రావు. ఈ ఊహక్కూడా అతనికి నవ్వొచ్చేయ బోయింది గాని- ముఖాన్ని ముఖంలాగే ఉం చుకోవాలి తప్ప పచ్చడిగా మార్చు కోవటం మంచిది కాదన్న ఉద్దేశ్యంతో ఈసారి కూడా అతి కష్టమ్మీద ఆ నవ్వుని ఆపుకున్నాడు . అంతలో… ఓ ముప్పమ్‌ ఏళ్లో వివాహిత మెరుపు తీగె అటుగా నడుచుకుంటూ వచ్చింది. స్థూలకాయురాల్ని చూసి ‘‘నువ్వానీలిమా? అంటూ ఠక్కున నిలబడి పోయింది- ఆనందంగా ! ఆ ( నేనేనక్కా ! గుర్తు పట్టలేనంతగా మారిపోయాను కాదూ ? ‘‘అంది నీలిమ నా మధేయురాలైనట్టి సదరు స్థూలకాయురాలు ‘‘ అవున్నీలూ ! చాలా మారిపోయావ్‌’’ ‌చాలా కాదూ. చాలా చాలా మారిపోయావ్‌’’ అం‌ది మెరుపు తీగై స్థూలకాయురాలి కేసి నఖ శిఖ పర్యంతం ఆశ్చర్యంగా చూస్తూ. ‘‘ నువ్వో ఒక్కదానివే కాదక్కా ! ఈమధ్య నన్ను చూసి అందరూ ఇలాగే ఆశ్చర్య పోతు న్నారు. ఒక్క ఆరునెలల్లోనే ఇంత మార్పొచ్చే సింది నాలో…. ‘‘అవును మరి ! ఆశ్చర్యపోకుండా ఎలా ఉండగలుగుతారు? ఆ నీలూ ఈనీలూ ఒక్కరే అంటే నమ్మడం కష్టం..వండర్‌ ‌జరిగి నట్లుంది… మెరుపు తీగె అలా అలా అంటుంటే స్థూలకాయురాలి మీద తెగ జాలివేసింది ఆనందరావుకి. అంటే-పాపం ఓ ఆర్నెల క్రితం దాకా ఈ అమ్మాయి సన్నగానే ఉండేదన్నమాట ! ఈ మధ్యనే ఇలా లావైపోయిందన్న మాట ఇలా స్థూలకాయంతో బాధపడే బదులు డైటింగ్‌ ‌చేసి సన్నబడొచ్చుగా ? అనుకున్నాడు ఆనం దరావు . అతనలా అనుకుంటూ ఉండగా ఆ స్థూల కాయురాలు అంది ‘‘ఇదంతా నీ పుణ్యమే నక్కా! నువ్‌ ‌చెప్పబట్టే నాకా ఒబెసిటీ సెంటర్‌ ‌గురించి తెలిసింది లేకపోతే నేనందులో చేరి ట్రీట్‌మెంట్‌ ‌తీసుకునుండేదాన్నా ? నేనిపుడు బరువు తగ్గి ఇంతిదిగా సన్నబడ్డగలిగానూ అంటే అది పూర్తిగా నీ చలవే ! ఇపుడు నా ప్రాణానికెంత హాయిగా ఉందో తెలుసా ?’’ ఆమె అలా మాట పూర్తి చేసిందో లేదో ‘ దభేల్‌ ’ ‌మన్న శబ్దం వినిపించింది. ఏమిటో అని చూసేసరికి ఆటో ప్రక్కన స్పృహతప్పి పడి పోయున్న ఆనందరావు కనిపించాడా అతివ లిద్దరికీ.‘‘ పాపం మూర్ఛరోగి కాబోలు’’ అంది నీలిమ జాలిగా- ఆనందరావు వంక చూస్తూ ‘‘అవుననుకుంటా పాపం అంది మెరుపు తీగ అంతకన్నా జాలిగా. కోలపల్లి ఈశ్వర్‌ ‌నెల్లూరు.    

Featured గూడూరు సాహితీ

అనంతం

(పున్నమి మంచిమాట) ఈ సంసారం యందు పాంచ భౌతిక స్వరూపముతో జీవుడు అన్నీ తానే అని భ్రమించి చరించున్నాడు. ఈ విశ్వము అనంతము. ఈ విశ్వము నందు అగణిత దివ్య వసంతములు ఎన్నో కాలగర్భమున ఇమిడి పోయినవి. మరెన్నో వసంతములు సిద్దముగా యున్నవి. ఈ పక్రియ అనంతం దీనికి అంతము లేదు. ఇది నిరంతం కొనసాగే పక్రియ. సముద్రము ఒడ్డున యుండే సైకత రేణువులు అనంతం. వాటిని లెక్కపెట్టుట ఎవరి వల్ల గాదు. అలాగే ఈ ప్రకృతి యందు విరాట్‌ ‌పురుషుని రూపము అనంతం. ఆయన చేతలు అనంతం. లీలలు మనోహరం. ఈ జగత్తునందు హిరణ్య గర్భునిచే స్పృశించబడిన వేద వ్యాస ప్రామాణికములు అయిన వేద ములు అనంతం. అనంతమయిన ఈ వేద ములు పూర్తిగా అభ్యసించిన వారు ఇప్పటికి లేరు. ఈ చరాచర సృష్టిలో చిదానంద స్వరూ పుని రూపములు అనంతం. ఎవరి అభీష్టం ప్రకారం వారు చిదానంద స్వరూపుని కొలుచు చున్నారు. ఆయన రూపం ఇది ఆయన లీలలు సంపూర్తిగా ఇవి అని పసిగట్ట గల నేర్పరి ఇప్పటికి లభ్యమగుట లేదు. ఈ అనంత విశ్వ మందు చిన్న ప్రాణి అయిన మానవుడు ‘అంతా నేనే’ అని భ్రమపడుట ఎంత విచిత్రం. ఈ అనంత విశ్వం నశ్వరం కాకపోవచ్చు. చతుర్ము ఖునిచే సృజియింపబడి ఈ ప్రకృతిలో ఇమిడి యుండే అంశములన్ని ఏదో ఒక నాటికి నాశన మైపోయేవి.ఈ అంశమునందు మానవుడు దృష్టి నిలిపి అశాశ్వతమయిన సుఖముల కంటే అనంతమైన ఖ్యాతి నందించే అంశములపై దృష్టి నిలుప గలగాలి. మనిషి జీవితం చిన్నదే కాని ఆ చిన్న జీవితంలో అనంతమయన ఖ్యాతి నిచ్చే అంశములపై దృష్టి నిలపాలి. సమాజమునకు ఏవి అయితే అవసరమో వాటి పై దృష్టి నిలపాలి. జగద్గురు శంకరాచార్యులు, శ్రీ సాయినాధులు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంన, వివేకానందుల వంటి వారిని ఆదర్శంగా యుంచుకొని జీవితం గడప గలగాలి. ఈ అనంత విశ్వము నందు మానవుని పాత్ర చాలా పరిమితమయనది. తన సహజ మైన మర్కటబుద్దితో జీవిత పరమావధిని మానవుడు మరచుచున్నాడు. శ్రీనివాస చరణార-విందము పై మనసు లగ్నము చేయక తన తోటి ప్రాణులతో అకారణ వైరము సృష్టించుకుంటు, పాపము ప్రాప్తించుకుంటు, నానా క్లేశములందు చిక్కుకుని తాను అనుభ వించుచున్న ఈ సూక్ష్మమయిన జీవితము శాశ్వతము అని భావిస్తూ ఆశ పాశములందు చిక్కుకొని స్వప్నజగత్తునందు పరిభ్రమించు చున్నాడు. అనంతుని మరచి జీవితం అనంతం ఈ ఊహలలో విహరించుచున్నాడు. జీవిత మంటే చిల్లుపడిన నావపై ప్రయాణమని గ్రహించ గలగాలి. జీవితం నీటి బుడగ అని గ్రహించగలగాలి. అనంతుని పొందుటకు అహర్నిశం ఆరాటపడాలి. సహజంగా మాన వుని రజోగుణం తయోగుణం అంటి పెట్టు కుని యుంటాయి. ఈ గుణములు వెను వెం టనే వీడి జ్ఞాన తీర్ధ గ్రహణం చేయగలగాలి. సత్వ గుణము వంట బట్టించు కోవాలి. జీవన సమరము నందు అనేక మయన సంక్లిష్టత లు ఏర్పడుతాయి. వాటినే స్మరించుకుంటూ దిగులు పడరాదు. ఒక మహోన్నత కార్యసిద్దికి లక్ష్యమేర్పచుకొని, ప్రణాళిక సిద్దం చేసుకొని అనంతమయిన మూర్తిమత్వమును ఏర్పరుచుకొని జీవనయోగం గడపగలిగిన వాడే ఇలలో సిసలయిన నేర్పరి. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని సామాన్యుడు కాలం గడపాలి. ఎందుకంటే వారిని అనుసరిస్తే ఎటువంటి సంకటమయినా, క్లేశమయినా సులభంగా దాటవచ్చు. మృత్యువు అనేది నీడవలె, ఇంకా కఠినంగా చెప్పాలి అంటే బెబ్బులి పంజావలె వెన్నంటే యుంటుంది. జనన మరణాలు అతి సహజం. ఈ ప్రకృతిలో ప్రతి ఒకడు నా ఆత్మజుడు అనే అనంత గుణమును మన మనసులో పెంచుకోవాలి. ‘అందరూ నా ఆత్మజులే అనే భావన’ సర్వకాల సర్వావస్ధల యందు మనసు స్వార్థ్దము, ఈర్ష ్య ద్వేషములకు ఆతీతంగా యుంచుతుంది. కర్మేంద్రియ పంచకమును అదుపులో యుంచుకొని ప్రతి క్షణము అనంత నారాయణుని యందు అనంత నారాయణునిపై మనోలగ్నము గావించినవాడే జీవన పోరాటమునందు ధీశాలి. ఏ రోజుకయినా అంతమయ్యే జీవి అనంతుని యందు ఆశ పెంచుకొని ఆయన కోసం ఆరాట పడగలగాలి. శాశ్వతంగా పేరుతెచ్చే కర్మలపై మనసు లగ్నం చేసి అనంతమయిన కీర్తిని పొందాలి.ఆత్మ శాశ్వతం కాని పరమాత్మ అనంతం అనే అంశం పట్ల జాగరూకత వహించాలి.ఈ ప్రపంచంలో అనన్యమయినది అనంతమయినది మోక్ష ప్రాప్తి. సాధువులకు గాని ముక్షువులకు గాని అనంత లోక ప్రాప్తి అనేది ఘృత సహిత క్షీరాన్నం వంటిదని గ్రహించాలి. వారి మార్గములో మనము నడచి, జీవన అంత్యదశలో అనంతుని సాన్నిహిత్యం సాధించుటకంటే అత్యున్నత దశ వేరొకటి లేదని మనం గ్రహించాలి. టి.వి.శ్రీధర్‌ ‌గూడూరు.

ఆంధ్రప్రదేశ్ సాహితీ సినిమా

గాలిని సడిసేయనివ్వని దేవులపల్లి

తేనే పాటల జాబిల్లి-దేవులపల్లి అని పేరు పొందిన శాస్త్రిగారు 1.11.1897న తూ।।గో।। జిల్లా పిఠాపురం దగ్గరలోని చంద్రాయ పాలెంలో సీతమ్మ వెంకటకృష్ణశాస్త్రి గార్లకు జన్మిం చారు. పదేళ్ళ వయసులో పద్యరచన పదహరవఏట అష్టావధానం చేసారు. డిగ్రీ ముగించి ‘‘ట్యూటర్‌’’ ఉద్యోగం చేస్తూ విద్యార్థుల కోసం జయజయ ప్రియభారతి పాటరాసారు. ప్రవాసము ఊర్వశి కన్నీరు శ్రావణి కార్తీక మహాతి విప్రనారాయణ వంటి పలు సాహితీ ముత్యాలను తెలుగువారికి అందించారు. బెజవాడ గోపాలరెడ్డిగారు కృష్ణశాస్త్రి గారికి మంచిమిత్రులు వారి ద్వారా బి.యన్‌.‌రెడ్డిగారి పరిచయంతో తొలిఎసారి ‘మల్లేశ్వరి’(1951) చిత్రానికి మంచిపేరు వచ్చింది(1952)లో అనా ర్కలీ చిత్రానికి పాటలు రాసారు. కాని ఈ చిత్రం నిర్మితం కాలేదు. కృష్ణశాస్త్రి ‘కృష్ణపక్షాన్ని’ 1921 ప్రారంభించి 1925 పూర్తిచేసారు. 1922లో తన పాతికేళ్ళ వయస్సులో భార్యావియోగం జరిగింది. 1953లో నాయిల్లు. రాజీనాప్రాణం. రాజగురువు(1954) బంగారుపాప భాగ్యరేఖ(1959)వంటి చిత్రాలకు పని చేసారు. అదే సంవత్సరం హైదరాబాద్‌ ఆకాశవాణిలో ‘ప్రయోక్త’గా చేరి ఎన్నో యక్ష గానాలు పలు లలితగీతాలు రాసారు. 1958 లో తన కుమార్తెను కోల్పోయారు. కృష్ణ శాస్త్రిగారు మల్లెల సౌరభాన్ని వెన్నెల చల్లదనాన్ని భావకవిత ఆనందాన్ని అన్నింటిని కలిపిన తెలుగు తీయదనాన్ని మనకు అందిం చారు. తన 67వఏట గొంతు క్యాన్సర్‌తో స్వరపేటిక తొలిగించారు. ‘భక్త శబరి’ (1960), ‘రాజమకుటుం’ (సడిసేయకే గాలి), ‘సుఖదు:ఖాలు’ ఇది మల్లెలవేళయని (1967), ‘అమాయకుడు’, మనిషైతే మన సుంటే(1968) ‘డా।।ఆనంద్‌’ (1966) ‘‘‌పూజాఫలం’’(1964), సంగీతలక్ష్మి(66), ‘ఉండమ్మ బొట్టుపెడతా’(68), ‘కలసిన మన సులు’(68), ‘ఏకవీర’, ‘జగత్‌కిలాడీలు’, ‘బంగారుపంజరం’(69), ‘మాయని మమత’ (70), కల్యాణమండపం’- ‘మట్టిలో మాణి క్యం’(71), సంపూర్ణ రామాయణం(72), ‘బలిపీఠం’(75), ‘మంచిరోజులొచ్చాయి’ (72), ‘భక్తతుకారాం(73), ‘చీకటి వెలుగు’(75), రాజరాజేశ్వరివిలాస్‌కాఫీక్లబ్‌, ‘అమెరికా అమ్మాయి’(76), ‘ఈనాటి బంధం ఏనాటిదో’(77), ‘ఒక అమ్మాయి కథ’(76), ‘సీతామాలక్ష్మి’(78), ‘కార్తికదీపం’(79), ‘మేఘసందేశం’(82), ‘వస్తాడేబావ’(77), ‘మేఘసందేశం’(82), ‘గోరింటాకు(79), ‘ఆనందభైరవి’(84), ‘రాక్షసుడు’(86). అలుపు ఎరుగని జీవనదిలా తన భావగీతాలతో తెలుగుసాహిత్యాన్ని సుసంపన్నంచేసారు. కేవలం 75 సినిమాలకు దాదాపు 180గీతాల మధుర స్మృతులను మనకు వదిలి 24-2-1980 న ఆ కళామతల్లి పదసేవకై తరలి పోయారు. ‘మావి చిగురు తినగానే’ – ‘ఆకులో ఆకునై’ ‘నీవుండే కొండపై’ ‘రాని కనీకోసంచెలి’, ‘ప్రతి రాత్రి వసంతరాత్రి’ -‘ఘనాఘనసుందరా’ – ‘పాడనా తెలుగుపాట’ -‘గోరింటా పూచింది’ ఈ పాటలు వాటిలోని భావపదవింటే పొంగని తెలుగు ఎద ఉండదు కదా!

Featured ఆంధ్రప్రదేశ్

తుర్లపాటి పెద్దాయన ఇక లేరు

*. ఆంధ్రప్రభలో నార్ల వెంకటేశ్వరరావు గారి సంపాదకీయాల ప్రభావంతో తుర్లపాటి పత్రికారచన ప్రారంభించాడు[3].తుర్లపాటి కుటుంబరావు పత్రికా రచన 1947 మార్చి నెలలో కేవలం 14 సంవత్సరాలవయస్సులో స్వరాజ్యంలో స్వరాష్ట్రం అనే శీర్షికతో మద్రాసు నుండి వెలువడే మాతృభూమి రాజకీయ వారపత్రికతో ప్రారంభమైంది. ఆ రచన స్వాతంత్ర్యోద్యమం ఫలితంగా 1947 పిభ్రవరి 20 న బ్రిటీషు ప్రధాని స్వాతంత్ర్య ప్రకటన చేసిన సందర్భంగా ఇక ఆంధ్రరాష్ట్రం పై దృష్టిపెట్టవలసిన ఆవశ్యకతను వివరిస్తూ రాసింది. ఎన్.జి. రంగా నిర్వహించిన వాహిని కి సహ సంపాదకునిగా, చలసాని రామారాయ్ నిర్వహించిన ప్రతిభ కు సంపాదకునిగా ప్రకాశం పంతులు గారి ప్రజాపత్రిక లో ఆంధ్ర ప్రాంత వార్తల సంపాదకునిగా పనిచేశాడు.1955 లో డాక్టర్ టివిఎస్ చలపతిరావు గారి ప్రజాసేవ ఆ తరువాత ఆంధ్రజ్యోతిలో 1960 మే 21 నుండి 1963 జూన్ వరకు, 1965 నుండి 1991చివరి వరకు పనిచేసి తదుపరి స్వేచ్ఛా పాత్రికేయనిగా తన వ్యాసంగం కొనసాగించాడు. 1960 లో ప్రారంభించిన వార్తలలోని వ్యక్తి అనే శీర్షికను మొదటి నాలుగు సంవత్సరాలు రోజువారీ శీర్షికగా ఆ తరువాత వారంవారీ శీర్షికగా 1991 వరకు కొనసాగించి ఆ తరువాత వార్త పత్రికలో 2010 నాటికి 50 సంవత్సరాలు నిర్వహించిన ఘనత తుర్లపాటిదే. ఈ శీర్షికలో భాగంగా నాలుగు వేలకుపైగా వ్యక్తుల జీవితరేఖాచిత్రాలు రచించాడు. ప్రజా జీవితంలో కాని రాజకీయరంగంలో కాని ప్రాచుర్యం లభించటానికి ఉపన్యాసాల తరువాత ఈ శీర్షికే కారణమని తన ఆత్మకథలో పేర్కొన్నాడు. చలనచిత్రాలపట్ల వున్న ఆసక్తిని గమనించి ఆంధ్రజ్యోతిలో చిత్రజ్యోతి విభాగానికి తదుపరి ప్రారంభించిన జ్యోతిచిత్రకు సంపాదకునిగా ఆంధ్రజ్యోతి యాజమాన్యం కుటుంబరావుని నియమించింది.అయితే జ్యోతిచిత్ర పనిలో పెద్ద పాల్గొనలేదని, వివేకానందమూర్తి, తోటకూర రఘు చూసుకొనే వారని అత్మకథలో పేర్కొన్నాడు. స్వాతంత్ర్యం తరువాత తొలి మంత్రివర్గంలో ఆంధ్రునికి చోటివ్వకపోవడాన్ని నిరసిస్తూ “స్వాతంత్ర్యోద్యమంలో అగ్రశ్రేణిలో నిలబడి అశేష త్యాగాలు చేసిన ఆంధ్రుల కివ్వవలసిన గౌరవమిదేనా? ఆంధ్రులలో కేంద్రమంత్రిత్వం నిర్వహించగల దక్షులు కాంగ్రెస్ హై కమాండ్ కు కానరాలేదా? అని ఆంధ్రప్రభలో రాసిన లేఖ చాలా సంచలనం కలిగించింది. వయోధికుడైనప్పటికీ 2003 మేలో తెలుగుకి ప్రాచీన భాషా ప్రతిపత్తి ఇవ్వాలని హిందీ తరువాత రెండవ అధికార భాషగా చేయాలన్న ఉద్యమాలకు బీజం వేశాడు. పాత్రికేయ వృత్తిలో తన వ్యక్తిత్వాన్ని విశ్వమానవుడుగా భావించుకొని జాతి, మత, కుల, వర్ణ, వర్గ, స్త్రీ, పురుష విభేదాలకు అతీతమైన మానవుడు మానవునిపట్ల మానవీయదృక్పథంతో వ్యవహరించే మానవీయ వ్యవస్థ ఆవిర్భవించాలన్న అభిమతం పెంచుకున్నాడు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని పున్నమి అనేక ప్రజా సంఘాలు ,జర్నలిస్టుల లు సంఘాలు మరియు పున్నమి కోరుకుంటుంది

Featured ఆంధ్రప్రదేశ్

ఏపీ హైకోర్టు సీజేగా అరూప్‌ గోస్వామి ప్రమాణం*

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్‌ గోస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ గోస్వామిచే గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీజేగా ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సీజే అరూప్‌ కుమార్‌ గోస్వామితో కలిసి సీఎం వైఎస్‌ జగన్‌, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కలిసి తేనీటి విందులో పాల్గొన్నారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి తాడేపల్లిలోని నివాసానికి సీఎం వైఎస్‌ జగన్‌ పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్ సహా పలువురు న్యాయమూర్తులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Featured

పంటకోత ప్రయోగములు :పునశ్చరణ తరగతులు

నెల్లూరు జిల్లాలోని అందరూ వ్యవసాయ సహాయ సంచాలకులు మరియు అందరూ మండల వ్యవసాయ అధికారులకు నేడు 30.12.20 తేదీన నెల్లూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం నందు పంటకోత ప్రయోగముల నిర్వహణ గురించి పునశ్చరణ తరగతులు జరిగాయి. రెవెన్యూ రికార్డుల సహాయంతో సర్వే నెంబర్ ఎంపిక చేయడం, ప్రయోగక్షేత్రాన్ని గుర్తించడం దగ్గరనుండి, గణాంక పద్ధతులు ఉపయోగిస్తూ పంటకోత ప్రయోగాలు నిర్వహించే విధానం, పర్యవేక్షణ చేయు విధానం, app లు వాడు పద్ధతి వరకు సంబంధిత అంశాలపై కొవూరు సహాయ గణాంకాధికారి శ్రీ PVST రాంప్రసాద్ వివరించారు. సచివాలయ వ్యవసాయ సహాయకుల చేయు పంటకోత ప్రయోగాలను పర్యవేక్షణ చేయు విధానం మరియు నివేదిక తయారుచేయు అంశముల గురించి వ్యవసాయ సంయుక్త సంచాలకుల కార్యాలయపు ADA అనితగారు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వారి కార్యాలయపు DDA ప్రసాదరావు గారు మాట్లాడుతూ పంటకోత ప్రయోగాలపై వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఈ శిక్షణా కార్యక్రమంలో JD కార్యాలయపు ASO నాగలక్ష్మి, జిల్లాలోని సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, ఇతర వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Featured

బిజెపిలో చేరుతున్నభాస్కరరావు

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి సమక్షంలో ప్రముఖ శాస్త్రవేత్త మరియు సామాజిక వేత్త అయినటువంటి భాస్కరరావు గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా సూళ్లూరుపేట నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిజెపి తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు శ్రీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి గారు తదితర నాయకులతో కలిసి బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి మరియు చిత్తూరు పార్లమెంటు జిల్లా ఇంఛార్జి శ్రీ ఆనందకుమార కోలా గారు పాల్గొన్నారు.

Featured తెలంగాణ

కొత్తరకం’పై ఆందోళన వద్దు..! సీసీఎంబీ

‘కొత్తరకం’పై ఆందోళన వద్దు..! సీసీఎంబీ జాగ్రత్తలు పాటించాలని సూచన బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్‌ మూలాలు భారత్‌లోనూ బయటపడ్డట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. యూకే నుంచి భారత్‌కు వచ్చిన వారిలో దాదాపు 40మందికి పాజిటివ్‌ వచ్చిన శాంపిళ్లను సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయోలజీ(సీసీఎంబీ) విశ్లేషిస్తోంది. ఇప్పటివరకు జరిపిన విశ్లేషణలో ముగ్గురిలో కొత్తరకం వైరస్‌ గుర్తించినట్లు సీసీఎంబీ వెల్లడించింది. ‘బ్రిటన్‌ నుంచి వచ్చిన వారిలో పాజిటివ్‌ తేలిన 40శాంపిళ్లు మాకు చేరాయి. కొత్తరకం వైరస్‌ను కనుగొనేందుకు ఇప్పటివరకు 20శాంపిళ్ల విశ్లేషణ పూర్తిచేశాం. వీటిలో మూడు శాంపిళ్లలో బ్రిటన్‌ కొత్తరకం వైరస్‌ మూలాలు గుర్తించాం’ అని సీసీఎంబీ డైరెక్టెర్‌ రాకేశ్‌ మిశ్రా మీడియాకు వెల్లడించారు. కొత్తరకం వైరస్‌ కనిపించడం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని.. అయితే పెద్ద ఎత్తున కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. *ఆందోళన వద్దు* ఈ కొత్త రకం వైరస్‌ బయటపడినప్పటికీ దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీసీఎంబీ డెరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా స్పష్టంచేశారు. ఇది చూడడానికి కొత్తగా కనిపించినప్పటికీ, ఇది కూడా కరోనా వైరస్‌ కావడంతో ఎలాంటి సమస్య ఉండదని పేర్కొన్నారు. లక్షణాలు, తీవ్రత అన్నీ ఒకేవిధంగా ఉంటాయని, కేవలం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారు. అయితే, ఈ కొత్తరకం వైరస్‌ మాత్రం అత్యధిక వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నట్లు రాకేశ్‌ మిశ్రా అభిప్రాయపడ్డారు. భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇదిలాఉంటే, డిసెంబర్‌ 9వ తేదీ తర్వాత యూకే నుంచి తెలంగాణకు దాదాపు 1216 మంది వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 1060 మందిని ట్రాక్‌ చేసి వైద్య పరీక్షలు నిర్వహించింది. మరో 156 మంది ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఇప్పటికే ఆరుగురు తిరిగి విదేశాలకు వెళ్లిపోగా, మరో 58 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఇక కొవిడ్‌ టెస్ట్‌ నిర్వహించిన 996 మందిలో 21 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.