ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
ఎల్బీనగర్, ఆగస్టు 12: ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన PC జె. సాయికుమార్ (13128) ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్రూమ్లో ఉరివేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
2024 బ్యాచ్‌కు చెందిన సాయికుమార్ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ-కాప్స్ డ్యూటీ నిమిత్తం ఏసీపీ కార్యాలయానికి అటాచ్‌మెంట్‌పై విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కర్మన్‌ఘాట్‌లో స్నేహితులతో కలిసి ఓ గదిలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది.
ఆగస్టు 12న తెల్లవారుజామున సుమారు 2.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే సాయికుమార్‌ను కామినేని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కారణాలపై దర్యాప్తు
కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది . పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సాయికుమార్ మృతదేహం నేపథ్యంలో ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.



