విద్య వ్యవస్థలో మార్పుకు అనుగుణంగా సూచనలు ఇవ్వండి.
విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు .
*విశాఖపట్నం డిసెంబర్ 5పున్నమి ప్రతినిధి:- * విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులపై ఉందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన 8వ జోన్ పెందుర్తి పరిధిలో సమగ్ర శిక్ష జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు – తల్లిదండ్రుల బృహత్ సమావేశానికి పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబుతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు కార్యచరణ చేపట్టిందని తెలిపారు. ముఖ్యమంత్రి మంచి ఆలోచనతో ఉపాధ్యాయులు – తల్లిదండ్రుల బృహత్ సమావేశం నిర్వహించాలని ఆదేశాల మేరకు పెందుర్తి పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులే కాకుండా ప్రజాప్రతినిధులు, పూర్వపు విద్యార్థులు, దాతలు పాల్గొని పాఠశాల అభివృద్ధితో పాటు పిల్లల భవిష్యత్తు కార్య చరణ పై చర్చించడం జరిగిందని మేయర్ తెలిపారు. పాఠశాలలో రాజకీయాలు ఉండకూడదని పాఠశాల ఉన్నతకి ప్రతి ఒక్కరు కృషితో, విద్యా వ్యవస్థలో మార్పుకు అవసరమయ్యే తగిన సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పిల్లలకు అవసరమయ్యే పుస్తకాలు, బ్యాగులు, స్టేషనరీ, యూనిఫామ్స్, షూస్ మొదలైన వాటి తో పాటు తల్లికి వందనం పథకాలను కూడా ప్రతి ఏటా అందిస్తున్నారని తెలిపారు.
అనంతరం పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో ఎటువంటి రాజకీయాలు తావులేకుండా మంచి విద్యా బోధన అందించేందుకు కృషి చేయాలన్నారు. పిల్లలను మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎంతోమంది మంచి ఉన్నత స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. పాఠశాలలో విద్య నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా పాఠశాల కమిటీ సూచనలు పాటించి పిల్లలకు బంగారు బాట వేయాలన్నారు. పాఠశాలలో పిల్లలకు అవసరమయ్యే మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని శాసనసభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు, పూర్వపు విద్యార్థులు, పలువురు దాతలు తదితరులు పాల్గొన్నారు.


