ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్
చిట్వేల్, డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి
రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, రైల్వే కొడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ ప్రత్యేకంగా ముందుకు వచ్చారు.
చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి, రాజంపేట ప్రాంత ప్రజల ఆశయాలను వివరించారు. ఈ సందర్భంగా, రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న ప్రజల బలమైన కోరికను ప్రతిబింబించే వినతిపత్రాన్ని ఉప ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే శ్రీధర్ అందజేశారు.
ఎమ్మెల్యే శ్రీధర్ మాట్లాడుతూ,
రాజంపేట చాలా ఏళ్లుగా జిల్లా కేంద్రానికి అర్హత కలిగిన ప్రాంతమని,పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి వేగవంతం కావడం, ప్రజా అవసరాలు తీరడంలో ఇది కీలకమని,ఈ నిర్ణయం స్థానిక ప్రజల కలల సాకారం అవుతుందని వెల్లడించారు.వినతిపత్రాన్ని స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల అభిలాషను గౌరవిస్తూ ఈ అంశాన్ని ప్రభుత్వం స్థాయిలో సమీక్షిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకోవడంతో స్థానికంగా రాజకీయ వర్గాలు, ప్రజాసంఘాలు విశేష ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.


