విశాపట్టణం, అక్టోబర్ 16 ః యువత ప్రత్యేక లక్ష్యంతో ముందుకు సాగాలని, అలా కాని పక్షంలో జీవితంలో ఏమీ సాధించలేమని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అన్నారు. నీతి, నిజాయితీగా, మంచి పౌరుడుగా ఉండాలని, సమాజానికి భారం కాకుండా బ్రతకాలని హితవు పలికారు. జీవితంలో ఎదిగేందుకు నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. కష్టపడకుండా ఏదీ రాదని, ఒకవేళ వచ్చినా ఎక్కువ కాలం నిలవదని అన్నారు. ఏదొక ప్రత్యేక లక్ష్యం పెట్టుకొని దాని సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. సెట్విస్, ఎన్.వై.కె. ఆధ్వర్యంలో కృష్ణా కాలేజీలో గురువారం జరిగిన యువజనోత్సవాల్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని యువతకు సందేశం అందించారు. చదువుతో పాటు కళలపై కూడా యువత దృష్టి సారించాలని, జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు శ్రమించాలని సూచించారు. తాత్కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోవాలని, సింగిల్ పాయింట్ నినాదంతో పని చేయాలని హితవు పలికారు. మనం పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏయే పనులు చేయాలో నిర్ణయించుకోవాలన్నారు. నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. పత్రికలు, పుస్తకాలు చదవాలని, మంచి చేతిరాతను అలవర్చుకోవాలని చెప్పారు. సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, మంచికి ఉపయోగించుకోవాలని, బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ పోటీల్లో, కార్యక్రమాల్లో యువత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
కార్యక్రమంలో సెట్విస్ సీఈవో కవిత, యూత్ ఆఫీసర్ మహేశ్వరరావు, కృష్ణా కాలేజీ ప్రన్సిపాల్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


