ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ ఇంటర్నెటెస్క:
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై భారీగా సుంకాల భారాన్ని మోపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత దిగుమతులపై 50 శాతం టారిఫ్లు అమలులో ఉన్నాయి. ఈ క్రమంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తమలాగే భారత్ను లక్ష్యంగా చేసుకోవాలని యూరప్ దేశాలను వైట్హౌస్ కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపకపోతే.. యూఎస్గానే భారత్పై ద్వితీయ సుంకాలను విధించాలని ట్రంప్ యంత్రాంగం కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆంక్షలు విధించడంతో పాటు ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ కొనుగోలును నిలిపివేయాలని కూడా కోరినట్లు వెల్లడించాయి. ఉక్రెయిన్తో యుద్ధం ఆపే విషయంపై చర్చించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఇటీవల ట్రంప్ భేటీ అయిన సంగతి తెలిసిందే. యుద్ధం ముగించేందుకు అగ్రరాజ్యాధిపతి తీసుకుంటున్న చర్యలకు కొంతమంది యూరోపియన్ నాయకులు మద్దతు పలికినట్లు తెలస్తోంది. భారత్కు వ్యతిరేకంగా ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై యూరోపియన్ దేశాలు మౌనంగా ఉన్నాయి. సుంకాలు విధించడాన్ని సమర్థించలేదు. అలా అని తప్పుబట్టలేదు. ఈ క్రమంలో భారత్ను లక్ష్యంగా చేసుకోవాలని ట్రంప్ పరిపాలనాధికారులు కోరడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. అక్కడ జరిగే ‘షాంఘై సహకార సంస్థ’ (ఎస్సీవో) వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు. భారత్పై ట్రంప్ విధించిన సుంకాలు, ఉక్రెయిన్తో రష్యా యుద్ధం వంటి కీలక విషయాలపై ఈ సదస్సులో చర్చకు వచ్చే అవకాశం ఉంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో కూడా మోదీ సమావేశం కానున్నారు.


