అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు
అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్‌పై సీబీఐ కేసు
రూ.228 కోట్ల బ్యాంకింగ్ మోసానికి సంబంధించిన వ్యవహారం
యూనియన్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో జై అన్మోల్ అంబానీ
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అనిల్ అంబానీపై సీబీఐ క్రిమినల్ కేసు నమోదు చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ కు సంబంధించిన బ్యాంకింగ్ మోసం కేసులో ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. అనిల్ అంబానీ కుమారుడిపై క్రిమినల్ కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసులో జై అన్మోల్‌తో పాటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, కంపెనీ మాజీ సీఈఓ రవీంద్ర సుధాల్కర్‌లను కూడా నిందితులుగా చేర్చారు. చీటింగ్, నేరపూరిత కుట్ర, నిధుల దుర్వినియోగం ద్వారా బ్యాంకుకు రూ.228.06 కోట్ల నష్టం కలిగించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
సీబీఐకి అందిన ఫిర్యాదు ప్రకారం, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ వ్యాపార అవసరాల కోసం బ్యాంకు నుంచి రూ.450 కోట్ల వరకు రుణ సదుపాయం పొందింది. అయితే, కంపెనీ సకాలంలో వాయిదాలు చెల్లించడంలో విఫలమవడంతో 2019 సెప్టెంబర్ 30న ఈ ఖాతాను నిరర్థక ఆస్తిగా (NPA) వర్గీకరించారు.
అనంతరం గ్రాంట్ థార్న్‌టన్ సంస్థ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో కంపెనీ రుణాలుగా పొందిన నిధులను ఇతర అవసరాలకు దారి మళ్లించినట్లు తేలింది. ప్రమోటర్లు, డైరెక్టర్ల హోదాలో ఉన్న నిందితులు ఖాతాలను తారుమారు చేసి, నిధులను పక్కదారి పట్టించి బ్యాంకును మోసం చేశారని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఫిర్యాదులో ఆరోపించింది. ఈ కేసులో భాగంగా సీబీఐ అధికారులు కంపెనీకి సంబంధించిన పత్రాలు, లోన్ అకౌంట్లను పరిశీలించనున్నారు.

