నష్టపరిహారంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
రెబ్బెన, ఆగస్టు 4 (పున్నమి రిపోర్టర్):
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నారాయణపురం గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మరోసారి తీవ్ర విమర్శలకు దారితీసింది. గ్రామానికి చెందిన రైతు పల్లె రవికు చెందిన ఎద్దు సోమవారం సాయంత్రం కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. పొలం వద్ద ఎద్దు విగతజీవిగా పడి ఉండటంతో రైతు కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
గ్రామంలో విద్యుత్ స్తంభాలు, వైర్లు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, ఈ విషయాన్ని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
“ఈ రోజు ఎద్దు చనిపోయింది.. రేపు మనిషి చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదకర విద్యుత్ లైన్లను వెంటనే మరమ్మతు చేయాలి” అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎద్దు మృతితో రైతు వ్యవసాయ పనులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ప్రభుత్వం వెంటనే రైతుకు తగిన నష్టపరిహారం అందించాలని, అలాగే ఈ ఘటనకు బాధ్యులైన విద్యుత్ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లను వెంటనే సరిచేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.



