డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడి కుదురు మండలానికి చెందిన అప్పనపల్లి గ్రామంలో మొoథా తుఫాన్ తీవ్ర బీభత్సం సృష్టించింది. సోమవారం రాత్రి నుండి ప్రారంభమైన గాలివానలు, వర్షాలు మంగళవారం ఉదయం వరకు కొనసాగి గ్రామమంతా ఆందోళనకు గురిచేశాయి. తుఫాన్ ప్రభావంతో రోడ్ల పక్కన ఉన్న పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగి, ప్రధాన రహదారులపై అప్పనపల్లి మెయిన్ రోడ్డుపై అనేక చెట్లు రోడ్డుమీద కూలి, వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించాయి.
ఈ పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ గెడ్డం మంగలక్ష్మి వెంకటేశ్వరరావు స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆమె ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ యువత రోడ్లపై పడిన చెట్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి వీఆర్వో అన్నపూర్ణ రావు, సిబ్బంది శ్రీనివాసరావు , సెక్రటరీ వెంకటరమణారావు, వంటి వారు స్థానికుల సహకారంతో రహదారుల్ని శుభ్రం చేసే పనిలో కృషి చేస్తున్నారు.
ఇక ట్రాక్టర్ డ్రైవర్ తాడి నాగరాజు వర్షపు గాలులు, లెక్క చేయకుండా ట్రాక్టర్ ద్వారా రహదారులపై పడిన చెట్లను తొలగిస్తూ సేవా కార్యక్రమాలలో పాల్గొన్నాడు. రాత్రంతా కొనసాగిన గాలివాన కారణంగా గ్రామంలోని విద్యుత్ సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మెయిన్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పక్కన పెద్ద చెట్లు కూలి విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ప్రమాదం సంభవించే అవకాశం ఏర్పడింది.
సర్పంచ్ గెడ్డం మంగలక్ష్మి వెంకటేశ్వరరావు తక్షణమే అక్కడికి చేరుకుని గ్రామ ప్రజలకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి కరెంటు సరఫరా నిలిపివేయాలని ఆదేశించి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. గ్రామంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
గ్రామ పంచాయతీ బృందం ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తూ, నష్టపరిస్థితులను జిల్లా పరిపాలనకు తెలియజేసింది. తుఫాన్ తీవ్రత తగ్గకముందే గ్రామంలో సహాయక చర్యలు చేపట్టడం స్థానికులు అభినందిస్తున్నారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో అప్పనపల్లి గ్రామం సహా మామిడి కుదురు మండలం మొత్తానికి నష్టం సంభవించింది. పంటలు, కొబ్బరి తోటలు, విద్యుత్ సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ గ్రామ సర్పంచ్, పంచాయతీ సిబ్బంది, స్థానికులు కలిసి చురుకైన చర్యలు తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదాలు తలెత్తకుండా నిరోధించగలిగారు.


