‘రిమర్స్’ సంస్థను సందర్శించిన న్యాయమూర్తి లిఖిత
పలమనేరు, అక్టోబర్ 09 ( పున్నమి ప్రతినిధి) :
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గంగవరం మండలంలోని రూరల్ ఇండియా మెడికల్ అండ్ రిలీఫ్ సొసైటీ (రిమర్స్) మానసిక వికలాంగుల పాఠశాలను గౌరవ న్యాయమూర్తి లిఖిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పిల్లల ఆరోగ్య పరిస్థితిని, వారికి అందిస్తున్న భోజన వసతులను మరియు పరిసరాల శుభ్రతను నిశితంగా పరిశీలించారు. సంస్థలో కల్పిస్తున్న వసతులు, నిర్వహిస్తున్న విధానం చాలా చక్కగా ఉన్నాయని ఆమె అభినందించారు. అనంతరం పిల్లలందరికీ ప్రభుత్వం తరఫున అందుతున్న పెన్షన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఎవరికైనా ప్రభుత్వం నుంచి రావాల్సిన పెన్షన్లు అందకపోతే, పలమనేరులోని “మండల న్యాయ సేవా అధికార సంస్థ” చైర్మన్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలా చేస్తే సంబంధిత ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పెన్షన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం న్యాయమూర్తి చేతుల మీదుగా పిల్లలందరికీ పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ‘రిమర్స్’ సంస్థ సెక్రటరీ డాక్టర్ పసుపులేటి సుధాకర్, ప్రిన్సిపల్ పి. తనుజ, కోర్టు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

