డా. ఎస్‌ఆర్‌జే డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
ఆత్మకూరు, ఆగస్టు 29 (పున్నమి ప్రతినిధి): జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా స్థానిక డా. ఎస్‌ఆర్‌జే డిగ్రీ కళాశాలలో శనివారం ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ జి. వరకుమారి, వ్యాయామ అధ్యాపకులు సిరిమామిళ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేసిన గిడుగు రామమూర్తి పంతులు సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జి. వరకుమారి, సిరిమామిళ్ల వెంకటేశ్వర్లు, డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రాంథిక భాష కారణంగా విద్యార్థులు పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తించి, వ్యావహారిక భాషలోనే విద్యాబోధన సాగాలంటూ గిడుగు రామమూర్తి పంతులు గొప్ప ఉద్యమం చేశారని తెలిపారు. అనేక మంది కవులు, పండితులతో వాదోపవాదాలు చేసి వ్యావహారిక భాషకు సాహిత్యంలో తగిన స్థానం కల్పించారని పేర్కొన్నారు. సవర భాషకు లిపి రూపకల్పన చేసి, నిఘంటువు రూపొందించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చారని కొనియాడారు.అనంతరం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ సేవలను స్మరించుకున్నారు. 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు వరుసగా మూడు బంగారు పతకాలు సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, అధ్యాపకులు రమణయ్య, సుప్రియ, వెంకట్రావు, శ్రీనివాసులు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.


