అనపర్తి, జూలై 21 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో–396ను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేదా పునఃసమీక్షించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరుల సంఘాల పిలుపు మేరకు చేపట్టిన “పెన్ డౌన్” నిరసనల నేపథ్యంలో, అనపర్తి–బిక్కవోలు సబ్ డివిజన్‌కు చెందిన దస్తావేజు లేఖరులు అనపర్తి శాసనసభ్యుల కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
జీవో–396 అమలుతో దస్తావేజు లేఖరుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని, రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొనసాగుతున్న “పెన్ డౌన్” నిరసనల వల్ల ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. ఈ నేపథ్యంలో జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదా సంబంధిత వర్గాలతో చర్చించి పునఃసమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
వినతిపై స్పందించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సంబంధిత జీవోకు ఇంకా ముఖ్యమంత్రి ఆమోదం లభించలేదని, దస్తావేజు లేఖరులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరుల సంఘం బిక్కవోలు అధ్యక్షుడు మజ్జి గణపతిరావు, ఉపాధ్యక్షుడు చినబాబు, కార్యదర్శి వి. బాలాజీ కుమార్, ఖజానాదారు సీతారామశాస్త్రి తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.



